.................................
నువ్వుకూడా వెళ్ళిపోయాక వొక్కడినే మిగిలాను ఈ కొసన .
నిరాశ ఏం కాదు కానీ, నిరాశలాంటిదే; వెలితి బహుశా !
కొన్ని అంకెల్లా మిగిలిన ఫోన్ నంబర్ల మీద తడిమి
పేరును మళ్ళీ ఒకసారి మననం చేసుకుని
నిట్టూరుస్తూ నేనో అంకెలానే మారిపోయినతనాన్ని గుర్తుచేసుకుంటాను.
1
లోపలికే ప్రవహిస్తున్న ధారలా ఊరు -
ఊరిలో కూలిపోయిన ఇంటి గోడమీద నేను రాసుకున్న పేర్లలోంచి
సగం మాత్రమే మిగిలిన పేరును మనసులో మరొకసారి రాసుకుంటాను.
చేపిన పొదుగులనుంచి నే లాగిన లేదూడల పెదవులపై
అంటిన పాలనురగల్లోని మిగిలిన ఆకలిని
ఇప్పుడిక్కడ నేను అనుభవిస్తుంటాను.
గుంజకు కట్టేసి ఇంటిదగ్గరే వదిలిన లేగలకళ్ళలోని దు:ఖాన్ని
ఈ బీడులాంటి లోకంలో ఇప్పటి కన్నీళ్ళుగా
నేను మారిపోతుంటాను .
2
నాకు రాత్రే పగలు
పగళ్ళు పగుళ్ళు వారే రోజుల ఆత్మకథలు.
నిస్సిగ్గుగా ఊరేగే కాలంలో కాటువేసేందుకు
గొంతెత్తే 'మైక్'లు.
నిన్నో ప్రశ్న అడగనా - సమాధానం ఆశించకుండానే !
సమాధానాలన్నీ అంతర్ధానమైన సందర్భం నువ్వూ నేనూ ; అప్పటికప్పుడు
అమరే సుఖాల కోసమే మనలోని మాటలూ,మప్పితాలు!
3
ఖాళీ ఖాళీగా మారిన వీధుల్లోంచి
అటుగా ప్రయాణిస్తూ కిటికీ నొకదానిని నాలోపలికి పిలుస్తాను.
నాలోకి తెరుచుకోలేక, కిటికీగానూ మిగలలేక అది అక్కడే మిగిలిపోతుంది
తెరుచుకావాల్సింది నేనే నాలోకి
#
లేగకళ్ళ లోని దు:ఖం
నా వేళ్ళచివర్లలో !
[ మార్క్వైజ్ కు నివాళిగా ]
*19.4.2014,1.01am
No comments:
Post a Comment