.........................
అంతా తలకిందులు
నువ్వేది చెబుతున్నావో ఆ మాటల అర్థం నిజం కాదు.
నువ్వెలా కనిపిస్తున్నావో
ఆ కనిపిస్తున్నది నువ్వసలు కానే కాదు
చెబుతున్నదీ కనిపిస్తున్నది అంతా విలోమం .
హ హ హ హ హ
హ హ హ హ హ హ ....
అంతా తలకిందులు
అంతా మేకింగ్ ఆఫ్ కట్టుకథ ,మిధ్యా వాస్తవం ,ఈజీక్వల్టు అబద్దం టు ది పవర్ ఆఫ్ అబద్దం .
మాటలవెనుక, చేతల వెనుక,నమ్మకం వెనుక
నవ్వుల వెనుక
దాగిన మూగిన సత్యాల అసత్యాల్లోంచి
తవ్వుకుని ఇటు ఇంకాస్త ఇంకా లోపలికే తొలుచుకుంటూ వెళ్లి
తేలవలిసిన సత్యాలకోసం
వెదుకులాడటం అబద్డంలాంటి దినచర్య.
ఇప్పటివరకూ నమ్ముతున్నదేదీ
నిజమేమీ కాదు; అలాగని నువ్వొక నమ్మకంగా మారాక
బతుకుతున్నదీ నిజం అంతకన్నా కాదు
నీ నమ్మకాలన్నీ ఇదివరకే ఏర్పడిన చట్రాల్లోంచి
దిగుమతై, అవే నమ్మకపు వేషధారుల్లా భ్రమింపజేస్తున్నప్పుడు
ఆ కొనసాగింపు నమ్మకంగా మారినదే -నువ్వు !
నువ్వొక మతానివి,కులానివి,ఉపకులానివి,
ప్రాంతానివి,ప్రాంతంలో గొంతెత్తిన మరో విముక్తి నినాదానివి.
ఉమ్మడి వారసత్వంలో ఉమ్మగిల్లిన ఒకానొక సందర్భానివి.
నువ్వొక వోటువి, అమ్ముడై అమ్ముడుకాక
చౌరస్తాలో గమ్యమెటో తెలియక బిక్కుబిక్కుమనే సగటు దేశానివి
మార్కెట్ సంధించిన వ్యూహంలో భూమ్మీద పాదం మోపి
నీకంటూ ఒక అస్తిత్వంలేని ఒక మారకపు వస్తువువి,ముడి సరుకువి
ఏ విలువా లేని, నిర్ణయంకాని లేదా నిర్వచించబడని ఉత్తి శూన్యానివి.
నీ లోపలి అద్దంలోంచి నువ్వొక ప్రతిబింబంలా కాక
ఏ ప్రతిఫలనమూ అంటని బింబంలా మాత్రమే కనిపించే నువ్వు
గణనలో మరో అంకెగా మిగిలే జనాభా లెక్కవి.
హ హ హ హ
హ హ హ..
వేషాన్ని మారుస్తూ ,నిజాల్ని తారుస్తూ,అబద్దాల్ని నిజాలుగా భ్రమిస్తూ
భ్రమింపచేస్తూ ,భ్రమను చరిత్రగా పఠిస్తూ స్మరిస్తూ
ప్రమాణంగా మలుస్తున్నకాలంలో వెక్కివెక్కిపడే వో వెక్కిరింతవు.
*
[నగ్నముని 'ఆకాశదేవర' చదివి,లోపలికి పొదివాక]
16.9.2013
No comments:
Post a Comment