అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

5 Jun 2014

ఆకుపచ్చని గాలి


-----------------------------

తొమ్మిదో అంతస్తు పెంట్ హౌజ్ వాకిట్లో కూచుని 
నాలో నేను ఒక జ్ఞాపకాన్ని సరికొత్తగా మళ్ళీ పలకరించాను.

త్రివేండ్రం నా ఒకానొక పదేళ్ల వయస్సున్న జ్ఞాపకం-
అయ్యప్ప ఫణిక్కర్ ముసి ముసినవ్వుల్లో 
చిక్కుకుని సేదతీరిన జ్ఞాపకం.
చిద్విలాసంగా,గంభీరంగా కవిత్వాన్ని పల్కరించిన జ్ఞాపకం.

కొబ్బరాకుల సందుల్లోంచి తొంగిచూస్తూ
అల్లరల్లరి ఆటలమధ్య అలిసిన ఎందపొడలాంటి జ్ఞాపకం.

సముద్రమ్మీది నుండి కావాలనే తప్పిపోయి
నగరవీధుల్లో జులాయిగా తిరుగుతూ
మామధ్యన దూరి జుత్తంతా చెదరగొట్టి చిక్కకుండా
పారిపోయిన సముద్రపుగాలి జ్ఞాపకం.

ఎటుచూసినా ఆకుపచ్చని గాలి.
ఆకుపచ్చని జీవితం,ఆకుపచ్చని ఊహ,స్పందన,పలకరింపు,
కరచాలనం,అనుబంధం-

బెంగగా శాంతన్ హరిదాసన్ బైకుమీద కూచుని
ఆ వీధిలోంచి పదేళ్లకిందటి కలయికను తలుస్తూ
సాగిపోయాను.
జ్ఞాపకం-
పుటలు పుటలుగా, సముద్రపు గాలిలా తెరలు తెరలుగా మారి నా ముందు కదులుతోంది.
ఫణిక్కర్ లేని వాకిలిని మోస్తూ త్రివేండ్రంలో ఆ ఇల్లు
అట్టవేయని పుస్తకంలా మాసిపోయింది.
ఎవరో పిలుస్తున్నట్టు మళ్లీ మళ్ళీ వెనక్కితిరిగిచూస్తూ
దాటిపోయాను,అలా పిలుపు వినబడాలని ఎదురుచూస్తూ-

ఆ పిలుపు వినబడనే లేదు.
ఆ పిలుపుకోసం వెదుకుతూ
ఇలా ఈ తొమ్మిదో అంతస్తులో ప్రియదాసు ఇంటివాకిట్లో-
ఆకుపచ్చగాలి
విసురుగా ఏదో చెపుతూ,నాచుట్టే తిరుగుతూ-
మా మధ్యలోంచి అటుఇటూ పరుగులు పెడుతూనే ఉంది.

కొన్నికబుర్లు,ఇంకొన్ని జ్ఞాపకాలూ ముగిసాక
ఆ ఆకుపచ్చని గాలి ,కొన్ని వర్షపు తుంపరల్ని తోడు తెచ్చుకుంది.
ఇక తప్పనిసరై ఇంటిలోకి అడుగుపెట్టామో లేదో
ఫణిక్కర్ నవ్వుతూ గోడమీంచి
ఆ ఆకుపచ్చనిగాలితో మాట్లాడుతూ కనిపించాడు.

[జనవరి 2012 లో ఒకానొక కేరళ ప్రయాణపు జ్ఞాపకం ]
21.12.2013

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...