అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

12 Oct 2011

కుడికాలు


                                       

అలిసిపోతున్న నాకు మళ్ళీ ఇలా ఆశలా
ఎదురయ్యావు

కలలులేని రాత్రిలో
సేదతీర్చే కవితలా మారావు
రహస్యాలు లేని రోజులకు
నీవే రూపశిల్పివయ్యావు
కవియోధుని కాపాడే
ఊహవయ్యావు. భావుకతవయ్యావు
గాయపడిన దేహంపైన
వాలిన అమృతహస్తంలాంటి పక్షివయ్యావు
వసంతంలా భూమిని వరించిన
రంగురంగుల నవ్వువయ్యావు
సీతాకోకచిలుకలా మారిన
రూపాంతర జీవనపరిణామానివయ్యావు.

 ఊడుగుచెట్లు, పల్లేరు కాయలు, నల్లవాగులో నా రక్తం పీల్చిన జలగలు, మంచెల మీద నేనల్లిన పాటల గమకాలు, నోరూరించిన తుంగలు, తలలూపే జొన్నకంకులు,.. అన్నిటా తొంగి చూసిన అద్భుత, చిత్ర విచిత్ర భావాల మిశ్రమపు బతుకు పుప్పొడివయ్యావు.

సానబట్టిన ఉలిలాంటి
నాలోని కాంక్షవయ్యావు
నా నిద్రించిన రాత్రుల్లో దోగాడిన
పసి యవ్వనానివయ్యావు
చిగిర్చే చింతచిగురుమీద
ప్రకృతి గీసిన భవిష్యత్తు
ఆకుపచ్చదనానివయ్యావు

అద్దం ముందునిలబెట్టి
నన్ను నాకు చూపించిన ఆత్మవయ్యావు
మా అమ్మ ముఖం ముడతల్లో
తొంగిచూసే వాత్సల్యపు మెరుపువయ్యావు
చెవుల్లో గింగిర్లుపోయే మా నాన్న
గొంతులోని కూనిరాగం లా
నా హృదయాన్ని తాకే అద్భుత వాహికవయ్యావు

ఎంత కరుణ
ఎంత ప్రేమ
ఎంత వాత్సల్యం నీకు

నీ కుడికాలు నా జీవితపు వాకిలిలో
మోపినప్పుడే
నేను అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడాను

నా మనసుకు తొడిగిన స్వప్నాలకు
నీవిచ్చిన అర్ధంతోనే
నేను కవినయ్యాను.

5.2.2001

1 comment:

  1. hrudyangaa undi sir...meeru kavi ga marina vainam....love j

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...