అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

15 Jul 2011

పెనుకొండ కవితలు

ముత్యాల చెరువు

ఊరు ఊరంతా కొండలు మాత్రమే నివసిస్తున్నట్లు
పెనుకొండ -అదో ఊరు .
11 వ శతాబ్దం ఆ ఊరిని కలగన్నది.

చుట్టూతా పెనవేసుకున్న కొండలమీంచి
దుమికే వర్షాకాలపు నీటిని
తన పక్కనే ముత్యాల చెరువులో దాచుకుని
జలకాలు ఆడుతుంటుంది .

ముత్యాలచెరువు నిజంగానే అది  'భోగినీ చెరువు'.!

వసుచరిత్ర ప్రబంధపు కధాక్షేత్రంలో
చేతులు చాచి నిల్చున్న 'కోలాహల పర్వతం'కళ్ళల్లో
మెరిసిన  'శుక్తిమతి' నది ఈమే !!
గిరిక,వసురాజుల ప్రణయానికి ప్రవాహసాక్ష్యంగా
రామరాజభూషణుడు కలవరించిన కవిసమయం కూడా  ఇదే!
చరిత్రను  తనలో దాచుకుని
గంభీరవదనంతో తనలోతాను సుడులు తిరుగుతోంది.

విజయనగర సామ్రాజ్యం తనను తాను కాపాడుకోవడానికి
తలలెత్తిన శత్రువుల్ని సున్నపుమూటలు కట్టి తోసిన
                                    సెగలు కక్కిన  మృత్యుగుండం ఇదే!
ప్రణయానికి,పరిహారానికి ఒకేలా తుళ్ళింతలు పోయినా
ఇప్పుడది పశ్చాత్తాపంతో కుములుతున్నట్లు చిక్కిపోయింది.
వస్త్రాలు మారుస్తూ స్నానఘట్టంలో 
పరిహాసాలు ఆడుకుంటున్న వనితలవైపు ఓరగా చూసిన పాపానికి
తానే వివస్త్ర అయి  శిక్ష అనుభవిస్తోంది.
కోటచుట్టూ కందకాలలో పరుగులు పెట్టి పెట్టీ
కాళ్ళు సహకరించక కూలబడిన పండు ముదుసలిలా
కదలక మెదలక ఒకచోటే అలా కూలబడిపోయింది.

ఎవరైనా అటువైపు వెళితే
ఒకసారి పలకరించి రండి.
మీతో ఇంకేమైనా రహాస్యాలు చెపుతుందేమో !!!

3 comments:

  1. వొక కవి అయిన తెలుగు పండితుడు మాత్రమె పలవరిచే అందమైన కవిత్వ పలుకులు ఇవి...వహ్జీ ...యా 'ఖూబ్' జీ.....ఏక్ నజరానా దేనే కే లియె దిల్ కర్తా హై.... మగర్ అబ్ తో ఏ చోటీ మోటీ బాతోం సే ...బస్ ..సంమాన్ కరూ.....ఔర్ ఏక్ బార్...తాలియా...

    ReplyDelete
  2. వస్త్రాలు మారుస్తూ స్నానఘట్టంలో
    పరిహాసాలు ఆడుకుంటున్న వనితలవైపు ఓరగా చూసిన పాపానికి
    తానే వివస్త్ర అయి శిక్ష అనుభవిస్తోంది.
    కోటచుట్టూ కందకాలలో పరుగులు పెట్టి పెట్టీ
    కాళ్ళు సహకరించక కూలబడిన పండు ముదుసలిలా
    కదలక మెదలక ఒకచోటే అలా కూలబడిపోయింది.


    bagunaaayi

    ReplyDelete
  3. పెనుకొండ ను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...