నీ కుతూహలమంతా
నా వ్యాఖ్యల గురించే
తెగని సంకెలను నాలోనే మోస్తూ
తాళంచెవి కోసం వెతుక్కుంటూ
ఇక్కడిలా బంధింపబడి ఉండిపోయాను.
నా సమస్తం ఒక గది
ఆ గదిలోనికి అపుడపుడూ తొంగిచూసే
ఒక కిరణం, మరికొన్ని అస్పష్ట శబ్దాలు
వాటిలోకి దూరిపోయి నన్ను నేనే అనువదించుకుంటున్నాను
నేనేమి వ్యాఖ్యానించగలను
రెండు పొడిమాటల చివర్న తగిలించుకున్న
ఒక చిర్నవ్వుగా పిలవబడే ఒకానొక అగ్నిపర్వతాన్ని మోస్తూ
చిట్టచివరికిలా మిగిలే ఉన్నాను.
నేనేమీ వ్యాఖ్యానించగలను
కొన్ని మాటలు, మరికొన్ని లాలసతో నిండిన ఊహలు
కొన్ని అనుబంధాలు,వాటిని ఇష్టంగానే కొనసాగించే ఆదర్శాలు
కొన్ని త్యాగాలు,వాటిని చివరికంటా నిభాయించే సంకల్పం
కొంత మానవత్వం ,దగ్గరి దారులేవీ వెతుక్కోని నిర్మలత్వం
ఇంతకుమించి
నేనేమి వ్యాఖ్యానించగలను
అలసటల్లోనూ,అశాంతుల్లోనూ,ధిక్కారాలలోనూ ,పెనుగులాటల్లోనూ
ఇంకా కాస్తో కూస్తో మిగిలి నాదాకా చేరే నిర్మలస్నేహాల్లోనూ
మిత్రశత్రువుల్లో
శత్రుమిత్రులల్లో దాగిన వ్యూహాల్లోని పలకరింపులలోనూ
ఇలా బంధింపబడి
నాకోసం మిగిలిన జీవితాన్ని
చివరికిలా
జీ వి స్తూ నే ఉ న్నా ను.
నా దగ్గర ఇంకేమీ వ్యాఖ్యలు మిగలనే లేదు !
నేనేమి వ్యాఖ్యానించగలను !!
16.2.2013
No comments:
Post a Comment