గాయమైన కాలమూ, మానుతున్న కాలమూ ఒకటే.
కొత్తకొత్త గాయాల సంఖ్య పెరిగి
సమీక్షించుకునే తీరికా లేక
రక్తసిక్తంగ మారుతున్న కాలంలాంటి దేహమూ
మూసిపెట్టిన బాధలా 'మూసి'
నల్లటి రక్తనాళంలా నగరం నిండా పరుచుకుంది.
కళ్లముందే నేనూ, నా దేశమూ నల్లగా మారిపోతూ
అవసరమైన చోటల్లా నిరసనలు, ధర్నాలు,
నిరసన సంతకాలు మాత్రం చేస్తూ పోతున్నాం.
నేనో సరిహద్దును-
అందుకని నా ఈ ప్రభుత్వాలకు నేనొక క్రీడ!
రెచ్చగొట్టి, కాల్పులు విరమించి, మొదలుపెట్టి
నానావిధ గాధల్ని దేశంనిండా విసిరేసి
నన్నో మాననిగాయంగా ఎల్లప్పుడూ ఉంచి
దేశాన్ని నిస్సహాయంగా మార్చేందుకు నేనొక ఆటవస్తువును..!!!
ఊపిరి తీయడం మానుకున్నాను
నా ఊపిరిలోని ప్రేమను చంపేస్తారని భయం..!
కలల్ని ఉరితీశాను, కలల సాకుతో కాల్చేస్తారని భయం..!
హాయిగా నవ్వడం మానుకున్నాను--
ఎగతాళిగా భావించి
నా దేశంలోనే నన్ను ఒంటరివాడిని చేస్తారని భయం
చీకటిలో కూర్చున్నాను, వెలుగు నన్ను దహిస్తుందని భయం.
ఇన్ని భయాల మధ్యన జీవితం... ఈ మిలీనియం కానుక
***
బాగుంది.నాకు నచ్చింది.
ReplyDeleteధన్యవాదాలు 'జలతారు వెన్నెల' గారు..!
ReplyDelete