అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

1 Jan 2012

కొత్త రూపం కోసం



నాకో కొత్త ప్రపంచం అనుభూతమవుతోంది
నాలోకి కొత్త భావాలేవో ప్రవేశిస్తున్నాయి

మళ్లీ నా ఎదురుగానే
నా కలలన్నీ ఆకారం దాలుస్తున్నట్లు అనిపిస్తోంది
ఉబ్బెత్తుగా ఎదిగిన బొజ్జమీద చేయివేసినప్పుడూ
ఆల్చిప్ప లోపల ముత్యం కదిలినట్లు
అదో చిత్రమైన కదలిక

ఆ రహస్య గర్భ ఉమ్మనీటి సరస్సులో
బుడబుడామంటూ ఈదులాడుతున్న చేపపిల్లలా
ఆ నెత్తుటి మొగ్గ

చెవుల్ని  పొట్టకి ఆన్చి
కొత్తలోక రహస్యాల్ని కనిపెట్టే శాస్త్రజ్ఞుణ్ణి నేను.
ఒక్కోసారి నా చేతులకు నేనే తగుల్తున్నట్టు
మళ్ళీ నేనే ఈ జీవితంతో విసిగి
మరో జీవితంగా రూపుదిద్దుకున్నట్టు అనిపిస్తుంది.
నేనూ తనూ కలిసి తనువుల రాయబారాలు నడిపి
విత్తిన విత్తనాన్ని విస్ఫార హృదయంతో గమనిస్తుంటాం
రోజూ కబుర్ల ప్రేమల నీళ్లు పోసి
తొలి కదలికల్ని చిగురుటాకుల మల్లే నిమురుతుంటాం.

ఆ క్షణాలూ ముచ్చట్లూ వేరు.
పులకరింతను దాటి, తృప్తిని దాటి
సంతోషాన్ని మించిన వింత అనుభూతి దొంతర.
మేమిద్దరం సృష్టికర్తలం. తొలి ప్రేక్షకులం, శ్రోతలం.

ఆమె శరీరమే ఒక కర్మారాగారం
ఆమె ఊహల ఉలితో రూపాన్ని చెక్కుతుంది
అర్ధరాత్రివేళ రహస్యాల్ని విప్పుతున్న కవిలా
తన నిమిషాల్ని సమాయత్తం చేస్తుంటాడు గుహలో
మాయసంచిని రక్షణ కవచం చేసుకుని
తన వెలుగుకోసం చీకటితో యుద్ధం చేస్తుంటాడు.
ఆ యుద్ధాన్నే నేను ప్రేమగా చూస్తున్నాను
ప్రతీ రోజూ నేనొక కొత్త ప్రపంచాన్ని కనిపెడుతున్నాను.

తొమ్మిదినెలల కలల సౌధం ఎవరూ నిర్మించకుండానే
చిత్రంగా దేహమై కదులుతుంటుంది
దేహసీమకూ భూమికీ మధ్య
ఏదో విడదీయని సంబంధం పెరుగుతూ వుంటుంది.
లోకానికో కొత్తభాషను ప్రసాదించడం కోసం
మేమిద్దరం ఒక కొత్త పదసంచయాన్ని నిర్మిస్తుంటాం
అన్ని భాషా రూపాలు కొత్త రూపం కోసం ఎదురుచూస్తుంటాయి.

కాకపోతే
ఆమెకూ నాకూ ఒకటే తేడా.
ఆమె తన దేహాన్ని తానే అనుభూతిస్తుంది
నేను మాత్రం అనువదించుకుంటాను.

2 comments:

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...