అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

9 Dec 2011

సరిహద్దు రేఖ



కలిసి బ్రతకడమూ నేరమే
కాక ప్రతి కదలికకి చేష్టకూ నడుమ తెలియని గీతలు

1.
తెలియకుండానే చెరగని గీతలమధ్య
సరికొత్తగా మొదలుపెట్టిన జీవితమూ ప్రశ్నలా మొదలవుతుంది

'దాదా వాళ్ళు, అల్లావాళ్ళు
అమ్మమ్మ,.. తాతయ్య వాళ్లు దేవుడు వాళ్ళ'ని
పలుకుతున్నఇదేళ్ల సాహిర్
మళ్లీ ఈ ప్రశ్నతోనే జీవితం
మొదలుపెడుతున్నాడు.

ఈ చిన్నారి జీవితమూ
బిగిసిన మతాల చట్రాన్ని దాటడం కష్టమే

వాడి ఆటపాటల్లో, కదలికల్లో, ప్రవర్తనలో
నవడికలో మతాల సరిహద్దులు
అమ్మమ్మ వాళ్ళిల్లు, దాదాదాదీల ఇళ్లు
రెండు విభిన్న సరిహద్దులు

3.
ప్రేమించడం నేరం కాదు
బొట్టు ఉండటం, పొలిమేరల్లో బొట్టు చెరిపేసుకోవడం నేరంకాదు
అలవాట్లు, ఆచరణలు కొట్టవచ్చిన జీవిత కొలమానాల్లా
'సరస్వతీ నమస్తుభ్యం'
'అల్లాహో అక్బర్'
జీవితాల మధ్య దాంపత్య అచరణ దూరాలు
కవ్విస్తున్న మతాలమధ్య పేర్లనుంచి
పెరుగుతున్న ఆంక్షల వేర్లనుంచి
ఆమె మందిరం, నేను మసీదుగానే మిగిలిపోతుంటాం
ఇక
మా దాంపత్యపు గుర్తుగా చిన్నోడికి
ఏ త్రిశంకు మందిరాన్ని నిర్ణయించహలో??

3.
మతమే లేని దశలోకి
చేరుకుంటామో లేదో తాత్వికులూ తెలపరూ
నాస్తికులు బొట్టుల్ని గాజుల్ని పసుపుతనాల్ని వీడరు
హేతువాదులూ కాఫిర్లూ మత చిహ్నాల్నీ వదులుకోరు
మతం కూడా
రక్తంలా శరీరంపై హక్కును సాధించుకుందేమో?

4.
దేహానికి దేశానికి మధ్య సరిహద్దురేఖ
దేహానికి మతానికి మధ్య
దేహానికి అనుబంధానికి మధ్య
దేహానికి ప్రేమకూ మధ్య
మెలికలు మెలికలు
పో
తు
న్న
సరిహద్దురేఖ.!

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...