అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

14 Nov 2011

తొడగని ఉంగరం




ముడతలు పడిన స్వప్నం ముందు
ఒళ్ళు విరుచుకుంటుంది నిద్ర
ఆ లోపలి
సొరంగంలోంచి అజ్ఞాత మానవుడెవడో నడుచుకుంటూ
తీరిగ్గా నిద్రా ప్రేమగీతాలు రచిస్తుంటాడు.

అతడి చుట్టూ
అంగరక్షకుల్లాంటి ఊళ్లు
ఒదగని ప్రేమలు
ప్రేమ చేష్టలు తెలియని కోయపిల్ల


తోట గెట్టుమీది బంతి పూలన్నిటిని
తలలో దోపుకుంటుంది
ఎట్లా కనబరచాలో తెలియని ప్రేమకు మల్లే

కలవరమైన మదితో
జగజీత్ సింగ్ గజల్ చుట్టూ గిరికీలు కొడుతున్న
తుమ్మెదలా అతడు
కోయపిల్ల స్వప్నాంతర వాసి

తొడగని ఉంగరం
చేపకూడా మింగని మరుపులో దాగిన ఉంగరం
అతని ప్రేమ కథ

విఫలప్రేమలన్నీ తాత్వికతల చుట్టూ తిరుగుతుంటాయి కాబోలు
చేల మధ్య ఎత్తాటిమంచె విరహవేదిక

కోర్కెలు తీరని ఆత్మలన్నీ
ఆ మంచెమీదే సమావేశమవుతాయి.

మోహానికి వయోపరిమితి లేదు
ప్రేమలు కొత్త సందర్భాలు
నిద్రల్లోనే ప్రేమల పునర్మూల్యాంకనం
రహస్య ప్రేమల్లోనే దాగిన నిజమైన ప్రేమలు

ప్రేమలకు ముందూ వెనకా
వాడిన ఊళ్లలాంటి కలలు..

1 comment:

  1. "తోట గెట్టుమీది బంతి పూలన్నిటిని
    తలలో దోపుకుంటుంది
    ఎట్లా కనబరచాలో తెలియని ప్రేమకు మల్లే"

    నిజం తొలి ప్రేమ లో స్వచ్ఛత తుదిదాకా శ్వాసింపబడే పరిమళం ఆ అమాయకత్వంతో చూపారు సర్....థేంక్యూ...

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...