అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

19 Sept 2011

అవ్వల్ కలిమ


చెబితే నమ్మరు కానీ
మా బాధలెవరూ మాట్లాడడంలేదు
మళ్లీ ఇక్కడ కూడా పదిపదకొండు తరాల తరువాతి వాళ్లే
తమ కోల్పోయిన వైభవాల తలపోతల్ని
మా అందరి భాషగా మాట్లాడుతున్నారు.

అనుభవాల దోపిడీ అంటే ఇదేనేమో!

నిజానికి నవాబు, ముస్లీము, సాయిబు, తురక-
ఎవరెవరు ఏ పేర్లతో పిలవబడుతున్నారో అదే వాళ్ల వర్గం -
చేజారిన రాజరికం, జాగీరు, నవాబీ, పటేల్ దర్పాల్లో
బతికిన వాళ్లకు కోల్పోయిన సుఖాల ఆనవాళ్లయినా మిగిలాయి
రెక్కకూ డొక్కకూ బతుకు బంధిఖానా అయినవాళ్లం.
ఎప్పుడూ మిగుల్చుకోవడానికి ఏమీ లేనివాళ్లం.
చెప్పుకోవడానికి మాకేం మిగుల్తుంది....

'ఓయమ్మా' అని పిలిచే మా అమ్మల్ని
'అమ్మీజాన్'  అని పిలవాలని తెలియదు.
అబ్బూ, అబ్బాజాన్, పప్పా - అని పిలవాలంట నాన్నల్ని
మాకేం తెలుసు - మా అయ్యలూ నేర్పనేలేదు
హవేలీ, చార్‌దివార్, ఖిల్వత్, పరదా అంటే ఏమిటో
మా తడికెల అంతఃపురం   గాళ్ళకు ఏం తెలుసు?
నమాజులంటే ఒంగి లేవటమేనని మా తాత చెప్పేవాడు!
ఈ బిస్మిల్లా హిర్రహిమాన్, అల్లాహో అక్బర్, రోజాల
భాషనెప్పుడూ నేర్వలేదు.

పండగలంటే పచ్చడన్నం మాకు
బిర్యానీలు, తలావ్‌లు, పలావ్‌లు, షీర్‌కుర్మాలూ మీకు
షేర్వాణీలు, రూమీటోపీలు, సలీం షాహి బూట్లు
ఘుమఘుమలాడే ఈధర్లతో మీ వస్త్రాలు
వాయువస్త్రాల నగిషీల్తో మేము


చెబితే నమ్మరేమో కాని చెప్పుకుంటే మీ ముందు
పలచనైపోతామని భయం.

పెంటుసాబు, ఉద్దండు, దస్తాగిరి, నాగులు, చిన ఆదాం
లాలు, పెదమౌలా, చినమౌలా, షేకు శ్రీనివాసు
బేతంచర్ల మొయిను, పాటికట్ట మల్సూరు  - ఇవే కదూ మా పేర్లు.

షేక్ సయ్యద్, పఠాన్ - మీ దర్పాల హోదాల ఖాందాన్ల
పేర్లు చెప్పి మమ్మల్ని దగ్గరికైనా చేరనిచ్చారా!
లద్దాఫ్, దూదెకుల, కసాబ్, పింజారీ ....
వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులమయ్యాం
మీ ఇళ్లలో నీళ్లు నింపి 'బినిస్తీల'మై
గుడ్డలుతికితే 'దోభీ' దోభన్'లమై
జుట్టు గొరిగితే 'హజ్జామ్'లమై
దొడ్లు కడిగితే 'మెహతర్'  "మెహతరానీ'లమై పోయాం
వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులుగానే
ఉండిపోయాం.

మీరన్నట్లు అందరమూ 'ముసల్మాను'లమే!
కాదనం – కానీ ఈ వివక్ష సంగతేమిటి?

మాకూ ఇష్టమే - తవ్వకల్లో ఎప్పటినుంచో తేలని లెక్కలు
ఇప్పుడూ తేలిపోతాయంటే  ఇష్టం కాదూ!
ఉమ్మడి శత్రువు గురించి కొత్తగా తెలుసుకునేదేముంది
ఉమ్మడి మితృత్వ మర్మం తేలాలిప్పుడు!
అణచివేయబడ్డ వాళ్లంతా దళితులే - కాదనం
కానీ, అణచివేతల నిర్వచనం కావాలిప్పుడు!

చిత్రం - మాకొచ్చిన బాష మాది కాదట!
మీరు మనదనే బాష మాకు రాదు
చివరికిలా మాతృబాష లేని సంకటంలో పడ్డాం.
తెలుగులో మాట్లాడి వెలివేయబడ్డాం.
"ముసల్మానువై వుండి కూడా తెలుగు బాగా మాట్లాడతావే"
నవ్వాలో, ఏడ్వాలో తెలియదు!

మా కలలన్నీ తెలుగే, కన్నీళ్లు తెలుగే
ఆకలై అన్నం అడిగినా, ఆర్తనాదం చేసినా
మొత్తం భావ వ్యక్తీకరణమంతా తెలుగే!

నమాజు చేయమంటే దిక్కులు చూశాం
'అజాఁ' విని అర్ధంకాక అదిరిపడ్డాం
'సూరా'ల  శృతుల్లో రాగాలు మాత్రమే వెతుక్కున్నాం.
మాకు రాని భాషలో పూజించమంటే
చివరికి ఆరాధనానందాన్ని కూడా కోల్పోయాం

చెబితే నమ్మరు కానీ
మా బాధనెవరూ మాట్లాడ్డం లేదు.

ఆత్మగౌరవం అందరిముందు పరిచిన 'దస్తర్‌ఖాన్'
అది అయినింటి వాళ్లు  మాత్రమే అనుభవించే హక్కు కాదు
సాటివాడి గౌరవంతో ఆడుకునేది
ఎవరైనా, అది ద్రోహం ద్రోహమే

అనుభవాల దోపిడి అంతకంటే పెద్ద ద్రోహం...


**సుప్రభాతం ...1998 లో మొదట అచ్చైయ్యింది.


9 comments:

  1. chaala baagundi. konni lines naa brain lo atukku poyyayi...
    thanQ

    ReplyDelete
  2. Mee kavitha adbhutham.
    Prarthana ku bhasha tho pani ledu. Meeku artham kaani vaatiki anuvaadaalu siddham gaa unnaayi. Kaavalsindallaa telusukovaali aney aalochana.

    Imtiaz Ali Khan

    ReplyDelete
  3. As per census data published by SKC (page 436), Urdu is the first language of 8% of AP population. How do you justify your claim of "Telugu Muslims" against this backdrop?

    ReplyDelete
  4. యాకూబ్ గారు .... మీ కవిత్వం ...నన్ను మావూరికి తీసుకెళ్ళింది . మా స్కూల్ మిత్రుడు
    మిత్రుడు జమాల్ నా కళ్ళల్లో మెదిలాడు . అతని వాదనలు గుర్తుకోకొచ్చాయి. Nice poetry.

    ReplyDelete
  5. యాకూబ్ గారు, మీ కవితలో ఆవేదన ఉన్నది. అది నిజం కూడా. ఇప్పటికి మన పల్లెల్లో ముస్లింలు స్పష్టమైన తెలుగు మాట్లాడుతున్నారు. నూటికో, వేయి మందికో ఒక్కరు కాని ఉర్దూ స్పష్టంగా మాట్లాడటం కాని, రాయటం కాని కనిపించదు. భాషలు ఎన్ని ఉన్నా, ఎన్ని మాట్లాడ గలిగినా మాత్రు భాష పై ఉన్న ప్రేమ గొప్పది. ఉర్దూ శాయరీలు హిందీ అనువాదాలు చూస్తుంటే, నేను ఉర్దూ నేర్చుకొంటే ఎంత బాగుడును అనుకున్నా. కాని అలీఫ్, బె, తే దగ్గరే ఆగిపోయింది, నా పయనం. ఏదేమయినా మీ కవిత్వం లో ఆర్ధత ఉన్నది.

    ReplyDelete
  6. "అందరమూ 'ముసల్మాను'లమే!కానీ ఈ వివక్షతేమిటి?
    యాఖూబ్ గారూ
    "మాకొచ్చిన బాష మాది కాదట,తెలుగులో మాట్లాడి వెలివేయబడ్డాం
    చివరికి ఆరాధనానందాన్ని కూడా కోల్పోయాం"
    ఈ పదాలు తెలుగు ముస్లిముల వాస్తవ జీవన పరిస్తితికి అద్దం పడుతున్నాయి.
    ఆరాధనానందం ఉర్దూ ముస్లిములకు కూడా చివరికి దొరకటం లేదు. అరబ్బీలో మాత్రమే ఆరాధించాలి అనటమే ఇందుకు కారణం.కొందరు ఉర్దూ ముస్లిములు తెలుగు మాత్రమే వచ్చిన ముస్లిములపట్ల చూపే వివక్షను విడనాడాలని మత పెద్దలు జుమ్మా ప్రసంగాలలో బోధించాలి.
    దూదేకుల ముస్లిముల్ని దళిత ముస్లిములుగా గుర్తించాలని గతంలో మజ్లిస్ పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేసింది.దళితుల స్థాయి దూదేకుల వారిని బీ.సీ.ఇ గ్రూపులో కలిపినా ఒకే గుంపులో ఉండేవాళ్ళు.సమాన సాంఘిక గౌరవం,సమాన భాషా గౌరవం,ఆర్ధిక రాజకీయ ఔన్నత్యం మెహతార్,దూదేకుల కులాలకు కూడా క్రమేణా కలగాలని ఆశిద్దాం.

    ReplyDelete
  7. మిత్రులారా! సహ్రుదయులారా!
    ఈ కవితలో నా చిన్నప్పటి నుంచి నేను అనుభవించిన స్థితి కన్పిస్తుంది.అంతే తప్ప,వేరే రకపు ఉద్దేశ్యం లేదు. ఇది ఒక జీవన వాస్తవం.అనేక పార్శ్వాలు ఉండొచ్చు,ఇదొక పార్శ్వం. ముస్లిం జనాభా ఎంత ఉన్నా -వారిలో గ్రామీణ ముస్లింలు ఒక సందిగ్ధ మత క్లిష్టతను ఎదుర్కుంటున్నారు.అది బాష కావొచ్చు.దారిద్ర్యం వల్ల కావొచ్చు.అంతర్,బహిర్ వివక్షల వల్ల కావొచ్చు.కాని ఇది ఒక కటినమైన వాస్తవం.

    ReplyDelete
  8. వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.కాని యెవరు తక్కువ కాదు.యెవరి పద్దతుల
    మీద వారికి గౌరవం ఉంటె మిగిలిన వాళ్ళు కూడా గౌరవిస్తారు.
    ఇవ్వకపొతె అది వాళ్ళ సంస్కారాన్ని తెలుపుతుంది.మన కెందుకు?

    ReplyDelete
  9. ప్రస్తుతం తీస్తున్న సినిమాలలో ముస్లిం అంటే ISI తీవ్వవాదిగానో పాకిస్తాన్ అభిమానిగానో, భారతదేశానికి శతృవుగానో చిత్రీకరించి, భారతీయులనుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయ్. మాప్రాంతంలో ముస్లింలను చూసాను. వారేమి కూలికెల్లకుండా బుక్కెడు మెతుకులు తిన్నట్లు చూడలే,దూదేకులవాల్లని చూశాను జీర్ణం కాని వస్త్రాలను నేచూడలే,రాల్లుకొట్టేవాల్లను చూసాను పట్టెడు మెతుకుల కోశం పగాలంతా రెక్కలు ముక్కలుచేసుకుని, ఎండలో మాడిపోవడం,వారిపిల్లలు 10,12 ఏళ్ళలోపువాళ్ళే వారి చిట్టి చేతులతో తిగల్లకు గంట్లు వేయడం చూశాను, కత్తులు సానపట్టేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, రొట్టెలు చేసేవాళ్ళు.

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...