అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

15 Jan 2013

వ్యూహాత్మక మౌనం


ఇటు గమనించు;
కొన్నిమాటల్ని వెచ్చించు
రోజువారీ కాలపు పట్టికలో ఇంకొంత కాలాన్ని చేర్చు

ఈ లోగిలిలో కాసేపు సేదతీరు,ఆడుకో పాడుకో
ఈ ప్రకృతిని నీ కుంచెలోంచి బొమ్మగా మార్చు
పాటలకు పరవశించు
పల్లవిగా మారు ,కాసింత గానమై గాలిలోకి ప్రవహించు
ఇప్పటికైనా కూసింత మారు !

పుల్లలెన్నో ఏరి ,ఎండనకా వాననక తిరిగి తిరిగి
ఇక్కడొక గూడు కట్టాం
అపుడపుడే నోరుతెరుస్తున్నపిట్ట పిల్లలకు
బువ్వపెట్టాం ,రెక్కలిచ్చాం ,ఎగిరే శక్తినిచ్చాం
ఒడుపు నేర్పాం ,కూసే కూతనిచ్చాం
తుఫానుల మధ్య
బిక్కచచ్చిన పసిపిల్లల్ని రెక్కలకింద దాచిపెట్టాం


అపుడేమో
నువ్వు నిద్రలో ఉన్నావ్;ఉహూ..నటిస్తున్నట్టున్నావ్
ఏమీ గుర్తుపట్టనంత దొంగనిద్ర ; పైగా గురక
మధ్య మధ్య కలవరింతల పలవరింతల వ్యూహాత్మక నిద్ర

పాట మొదలయ్యాక, గూడు  కట్టడం పూర్తయ్యాక
నడకలు నేర్పడం ముగిశాక ,కాపాడటం ముగిశాక
దొంగనిద్రలోంచి మెలుకువ
మెలుకువలో తొట్రుపాటు ;
లోలోపల భయం ,ఒకానొక ఆత్మన్యూనత -

జరిగిందేదో జరిగింది
అంతా మనమంచికే!

ఇకనైనా వ్యూహాత్మక మౌనం వీడు-
ఇటు గమనించు;
ఇప్పుడిక్కడ ఉత్సవం మొదలయ్యింది !!!

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...