అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

26 May 2020

ఈ లాక్డౌన్ లో ఇలా గడిపాను!

#Lockdown_Dairy
ఈ లాక్డౌన్ లో ఇలా గడిపాను!

~
కరోనా కాలం ఒకవైపు భయంతో బిక్కచచ్చిపోయేట్లు చేసింది నిజమే. ఇదే కాలంలో ఉద్యోగం నుంచి రిటైర్ అవడం. రిటైర్ అవడం సహజమే అయినా ఒక రొటీన్ నుంచి తొలగడాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టమైన పనే. అందులోంచి బయటపడటం ఒకవైపు, మరోవైపు ఈ క్వారంటయిన్ దిగ్బంధనం.
ఈ స్థితిలో కవిత్వం కాపాడింది. పుస్తకాలు కాపాడాయి. ఎప్పుడెప్పుడో అక్కడక్కడ రాసినవి ఒక దగ్గరికి చేర్చే పని కొంత కుదిరింది. చెదురుమదురుగా బుక్ షెల్ఫుల్లో ఉన్న కవిత్వం పుస్తకాలు ఒక దగ్గర అమర్చుకునే పని చేయగలిగాను. కేదార్ నాథ్ సింగ్, మంగలేష్ దబ్రాల్, కమలా దాస్ సురయ్య, అరుంధతీ సుబ్రహ్మణ్యం, చేరన్ రుద్రమూర్తి, సర్వేశ్వర్ దయాల్ సక్సేనా, మమత సాగర్, సచ్చిదానందన్ వంటి కవుల్ని కొంచెం ఎక్కువగానే చదవగలిగాను. ఇంకొందరు భారతీయ కవుల కవిత్వాన్ని గూగుల్ లో వెతికి పట్టుకోగలిగాను. Save చేసుకోగలిగాను. శివసాగర్ కవిత్వ సంకలనంలోంచి ఇప్పటి రీడింగ్ లో సరికొత్తగా కొన్ని అంశాలను పట్టుకోగలిగాను.
వరవరరావు గారి మొత్తం కవిత్వాన్ని ఒకేసారిగా చదవడం ఈ రోజుల్లోనే కుదిరింది. సాయిబాబా 'నేను చావును నిరాకరిస్తున్నాను- సాయిబాబా అండాసెల్ కవిత్వం' ఇప్పటి రీడింగ్ లోనే ఇంకొంత అర్థం చేసుకోగలిగాను.
1
కవిసంగమం గురించి ఇప్పటిదాకా వచ్చిన వ్యాసాలను ఒక ఫైల్ లా కంప్యూటర్ లో అమర్చగలిగాను.
Songs of the Saints of India, Text and Notes by John Stratton Hawley, Oxford University Press ప్రచురణ( Afsar Mohammed కానుక) లో కొత్త వెలుగుల్ని కొన్నిటిని పట్టుకోగలిగాను. పెరుమాళ్ మురుగన్ Songs of a Coward ఇన్నాళ్ల తర్వాత కొంచెమైనా తిరగేసాను. Tom C. Hunley పుస్తకం New writing viewpoints ' Teaching Poetry Writing' - A Five Canon Approach కవిత్వ నిర్మాణానికి సంబంధించిన ఉపయోగకరమైన పుస్తకం.
వీటన్నిటి మధ్యా ఈ లాక్డౌన్ కాలం కష్టంగానైనా ఇష్టంగానే గడిచింది ముఖ్యంగా చదువుకోవడం విషయంలో. పరవస్తు లోకేశ్వర్ 'సలాం హైదరాబాద్' తర్వాత రెండవ భాగంగా వచ్చిన 'కల్లోల కలల కాలం' ఈ కాలంలోనే చదవడం పూర్తిచేసాను. Venkateswara Rao Veluriగారు, వెనిగళ్ళ బాలకృష్ణారావు గారు కలిసి తెలుగులో అనుసృజించిన ఒరియాకవి సౌభాగ్య కుమార మిశ్ర కవితల సంపుటి 'ద్వాసుపర్ణ' చదవగలిగాను.
ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద నవల డా. కుం. వీరభద్రప్ప రచన 'అంతఃపురం' మధ్యలో మొదలుపెట్టానుకానీ ఇంకా పూర్తిచేయలేదు. ఇవి ఇలా ఉండగా ఎలానూ facebook లో వచ్చే అనేకానేక వ్యాసాలు, విషయాలు వున్నాయి కదా, ఆ పఠనం అదనం. కవిసంగమంలో ప్రతిరోజూ వచ్చే కాలమ్స్, ఆయా కవితాసంపుటులపై కవిమిత్రులు రాసే సమీక్షలు... ఇలా వీటిమధ్యన లాక్డౌన్ కాలం గడిచిపోతోంది.
మధ్యలో మే10 న 'ZOOM యువ కవిసంగమం' సీరీస్-1 కార్యక్రమం చేయడం ఉత్సాహాన్నిచ్చింది. చాలామంది కవిమిత్రులని చూడగలిగాను. వినగలిగాను. మే1 న విజయవాడ సాహితీమిత్రులు నిర్వహించిన zoom కవిసమ్మేళనం ఒక మంచి అనుభవం.
అయ్యప్ప ఫణిక్కర్ ఫౌండేషన్ రూపొందించిన కవితల ఆల్బమ్ Voices from Far and Near లో కొన్ని లైన్ల కవిత ఈ కాలంలోనే విన్పించాను.
https://m.facebook.com/story.php?story_fbid=10207468568229084&id=1734624479
బెంగళూరు 'కవిసంజె' మమత సాగర్ పదిమంది కవులతో నిర్వహించిన Zoom Poetry Meet లో Vinodini Madasu తో కలిసి పాల్గోవడం , కవిత్వం వినిపించడం అరుదైన అనుభవం. మంచిర్యాల డిగ్రీ కాలేజీ విద్యార్థుల కవిసమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కవిత్వ విషయాలు వాళ్ళతో పంచుకోవడం ఇటీవలి మరో అవకాశం. అదికూడా Zoom లోనే జరిగింది. అక్కడి తెలుగుశాఖ మిత్రుడు Patwardhan Mv పూనుకుని ఈ కార్యక్రమంలో నన్ను భాగం పంచుకునేట్లు చేసాడు.
2
నేను కొన్ని కథలు కూడా అప్పట్లో రాసాను. వాటిలో ఒకటి ఖదీర్ బాబు 'ప్రజాతంత్ర' ప్రత్యేక సంచికలో (మార్చి 2001) అచ్చేసాడు. ఆ తర్వాత Yousuf Shaik సంకలనం చేసిన 'వతన్' ముస్లిం కథలు బృహత్ సంకలనంలో నా రెండు కథలు' తజుర్బా', 'మన్నత్' చేర్చాడు కూడా! (అప్పట్లో ఈ పుస్తకాన్ని రివ్యూ చేసిన కె. శ్రీనివాస్ గారు నా కథల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గుర్తుంది. ఆ పేపర్ కటింగ్ ఇప్పటికీ దాచుకున్నాను)
జ్వలిత గారు సంపాదకురాలిగా వెలువడిన 'ఖమ్మం కథలు' సంకలనంలోకూడా ప్రచురించారు. ఈ కథంతా ఎందుకంటే ఆ పాత నోట్స్ లో రాసినవి ఇంకా ఆరు ఈ గృహాదిగ్బంధన కాలంలో బయటపడ్డాయి. వాటిని సరిచేసే పని ఇక మొదలుపెట్టాలి.
ఇంకా ఇష్టమైన పని ఒకటి వీటి మధ్యలో అప్పట్లో కొన్ని భాగాలు రాసి మధ్యలో విరామం పెట్టిన 'బతుకుకథ' సీరీస్ యాభై పేజీలైనా రాయడం. ఎంత రాసినా రొట్టమాకురేవు, బాల్యం, కొత్తగూడెం, ఖమ్మం, కాలేజీ, చదువు... ఇంకా అక్కడే ఉన్నాను. మిగతాది ఈ లాక్డౌన్ కాలంలోనే రమారమిగా ఒక కొలిక్కి తీసుకురావాలి. దాన్ని కొద్దికొద్దిగా టైపు చేసుకుని facebook Timeline మీద మళ్ళీ సీరియల్ గా మీముందుకు తేవాలి.
~
[ 1.లాక్డౌన్ మొదలైన తొలిరోజుల్లో కవిమిత్రులు Wilson Rao Kommavarapu గారి LIC టీమ్ స్లమ్స్ లో భోజన సరుకులు పంచే కార్యక్రమం మొదలుపెడితే, వాళ్ళతో మాట్లాడి మా చైతన్యపురికి రప్పించి, గుడిసెల్లో ఉంటున్న వందమంది పేదలకు ఒక్కొక్కరికి రెండువేల ఐదువందల విలువచేసే ప్యాకెట్లను సరఫరా చేసే పనిలో వారివెంట ఉన్నాను.
2. తినడానికిలేక ఇబ్బందిపడుతున్న మా దూరపు బంధువులకు అంతా కలిపి పదివేల రూపాయలు పంపగలిగాను.
3. మా బాబు ద్వారా ఆరుగురికి ఈ లాక్డౌన్ కాలానికి సరిపడా సరుకులు ఇప్పించగలిగాను.]
■◆■
ఫ్రెండ్స్!
#లాక్డౌన్_లో_ఇలా_గడిపాను!
'ఈ లాక్డౌన్ లో ఇలా గడిపాను!' అనే ఈ శీర్షికతో మిత్రుడు Vijayakumar Koduriని తన అనుభవాలను రాయాలని నామినేట్ చేస్తున్నాను.

3 Jun 2016

సృజనానుభవం -1


కొన్ని పదాలు కలిసి ఒక వాక్యమవుతుంది. కొన్ని పదాలు కలిసి ఒక కవితలో పాదమవుతుంది.
ఈ పదాలు ఏమిటి? వాటిలో ఏముంది?
మనిషిలోని ఆలోచనను, ఆవేశాన్ని, అనుభూతిని వ్యక్తీకరించే సాధనాలే పదాలు.
ఆకలేసినా, అలసటగా ఉన్నా, ఆగ్రహించినా ఎదుటి వారికి చెప్పాలంటే పదాలే కావాలి. బాధగా ఉన్నా, సంతోషపడినా చెప్పుకోవాలంటే పదాలే కావాలి. పదాలు కేవలం జీవంలేని సాధనాలు మాత్రమేనా!? - కానే కాదు, పదాల్లో జీవం తొణికిసలాడుతుంది. ప్రతి పదానికి దానిదైన ప్రాణం అక్షరాల గదుల్లో రహస్యంగా నిక్షిప్తమై ఉంది.
1
కేవలం కాలక్షేపానికి పత్రికలు చదివితే, పాప్ మ్యూజిక్ వింటే లేదా టీ.వీ కార్యక్రమాలు చూస్తే అందులోను మనకు పదాలే కనబడతాయి, వినబడతాయి. కాని ఆ పదాల్లోని జీవం, మన కళ్ళముందు రహస్యమయ లోకాలను సాక్షాత్కరింపజేసే జీవం కనబడదు.
పదాల ఈ జీవరహస్యం తెలిసినవాడే కవి.
పదాల జీవరహస్యాన్ని కనిపెట్టిన వాడే కవి. ఇది గొప్ప ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ గురించి పదిమందికి చెప్పాలన్నదే కవి పడే తపన. అందుకే కవిత రాస్తాడు.
2
అసలు కవిత ఎలా సృష్టించబడుతుంది?
ఒక్కోసారి అలవోకగా, నెమలీకలా అలా గాల్లో తేలుతూ వస్తుంది. జీవరహస్యం తెలిసిన కవి వెంటనే దాన్ని ఒడిసిపట్టుకుంటాడు. రంగురంగుల అందాల సీతాకోకచిలుకలా కవి కలంలో పదాలు ఒదిగిపోయి కాగితంపైకి ప్రవహిస్తాయి.
కాని కవితలన్నీ అంత తేలిగ్గా దొరకవు. ఒక్కో కవిత అడవి ఏనుగులా మచ్చిక కానంటుంది. కవి చేతికి దొరకనంటుంది. దాన్ని పట్టుకోడానికి కవి తనకు చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తాడు. మాటు తవ్వుతాడు. పట్టుకోవాలని దాని వెనక పరుగెడతాడు, జింకలా పారిపోతున్న పద్యం వెంట లంఘిస్తాడు. రాత్రంతా ప్రయాసపడతాడు. కాని దొరకదు.
‘’పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టి విడుచుట కన్నా పడిచచ్చుటది మేలు.’’ వేమన ఎప్పుడో చెప్పిన మాటలను ఏ కవి మరచిపోడు. పట్టుపడక తప్పించుకుపోయిన కవితను వెంటాడ్డం మానడు. గోడపైకి ఆహారాన్ని లాక్కెళ్ళే చీమలా మళ్ళీ, మళ్ళీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాడు. మరీ అలసిపోతే కాస్త కునుకు తీస్తాడు.
కలల్లోను పద్యమే రాజహంసలా ఎగురుతుంటుంది. ఏ తెల్లవారు జామున మూడుగంటలకో, నాలుగు గంటలకో అమ్మచేతి స్పర్శలా తాకుతుంది. అంతే హఠాత్తుగా కలలోనే లేచి కూర్చుంటాడు. కలం వెదుక్కుంటాడు. అప్పటికే కాగితంపై కవిత నవ్వుతూ సిద్ధంగా ఉంటుంది. కలనుంచి నిజంలోకి వెంటనే రావాలని, కవ్విస్తున్న ఆ కవిత మాయం కాకముందే దాన్ని ఒడిసిపట్టుకోవాలని కవి పెనుగులాడతాడు. అతను గెలిచాడా ! నిద్రమత్తు వదిలి పెన్ను వెదుక్కుని కవితను అక్షరాల్లో బంధిస్తాడు. అందుకే చాలా మంది కవులు తలగడ కింద పెన్ను పెట్టుకుని నిద్రపోతారు. ఒక్కోసారి అదృష్టం వెక్కిరిస్తే, కొన్ని అస్పష్టమైన పదాలు తప్ప కవిత కలల ప్రపంచంలోకే నెమ్మదిగా జారుకుంటుంది.
కొన్ని కవితలు చాలా చక్కగా, పొందిగ్గా, ముచ్చటగా ఉంటే, కొన్ని కవితలు అల్లరిపిల్లల్లా, చింపిరిజుత్తు, ఫ్యాషన్ కోసం చిరుగులున్న జీన్సుప్యాంటు వేసుకొస్తాయి. మరి కొన్ని కవితలు అనవసరపు లగేజీని మోసుకుంటూ అపసోపాలు పడుతుంటాయి. అవసరం లేని లగేజీని కవిత భుజాలపై నుంచి దించే బాధ్యత కవి తన భుజాలకెత్తుకుంటాడు. కాస్త ఎడిట్ చేసుకుంటాడు. కాస్త అన్న మాటే కాని, ఈ కాస్తకు అంతుండదు. ఎంత దిద్దినా ఇంకాస్త మిగిలే ఉంటుంది. అద్దం ముందు నిలబడి అద్దాన్ని వదలబుద్ది కానట్లు, కవికి కూడా తన కవితను ఎంత రాసినా, ఇంకా కొంచెం మిగిలిందన్న సందేహం ఉండనే ఉంటుంది.
*
చివరకు ఆ కవితను కాగితంపైకి ఎప్పుడు స్వేచ్ఛగా వదులుతాడా అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంటుంది.
కవి తన కవితను ప్రచురణకు పంపేముందు చదివిన ప్రతిసారీ... ’’అరే, ఈ లైను బాగోలేదు, తీసేయాలి... ఈ స్టాంజా ఇక్కడ కాదు పైన పెట్టాలి... ఈ లైనులో ఈ పదాలెక్కడినుంచి వచ్చాయి...‘‘ అనుకోవడం మార్చుతూ ఉండడం కొనసాగుతూనే ఉంటుంది. కొట్టివేతలు, దిద్దివేతలు... తీగలు చిందరవందరగా పెరిగిన చిట్టడవిలా కాగితం మారిపోతుంది. చివరకు, ఎలాగోలా కవికి కాస్త సంతృప్తి కలుగుతుంది.
3
చాలా మంది కవులు ప్రాసల కోసం, శబ్ధాలంకారం కోసం ప్రయత్నిస్తారు. ప్రతి స్టాంజాలోని పాదాల సంఖ్య కోసం లేదా, కాగితంపై కవిత రూపం కోసం (చిత్రకవితలు) ప్రయాసపడుతుంటారు. ఒక కవితలో చెప్పాలనుకున్న భావాలను పదాలద్వారా చెప్పడం మాత్రమే కాదు, కవిత చూడ్డానికి కూడా ఆ భావానికి ప్రతినిధి రూపంలో కనబడేలా రాయడం.
చివరకు ఒక కవితను అనుకున్నట్లు తీర్చిదిద్దిన తర్వాత ఆ ఆవిష్కరణను ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే కవి దృష్టిలో ఉంటుంది. తన ఆవిష్కరణను యావత్తు ప్రపంచం చూడాలి. అంటే చదవాలి.
అందుకే కవిత్వాన్ని చదువుదాం.
కవి దర్శించిన పదాల జీవరహస్యాన్ని, ఆ రహస్యమయలోకంలోని అనుభూతుల ప్రపంచాన్ని చూద్దాం. దాని గురించి మాట్లాడదాం.
జయహో కవిత్వం.

*

జనవరి 21,2015 

ఒక ప్రశంశ

"ప్రవహించే జ్ఞాపకం" తో ఓ పదిపన్నెండు సంవత్సరాల క్రితం తెలుగు కవిత్వ మైదానంలోకి నడిచి వచ్చిన యాకూబ్ ఈనాడు "సరిహద్దు రేఖ" ల్ని గీయాల్సి వచ్చింది. ఆనాటి అతని కవిత్వ తత్వాన్ని గురించి "రమణ మూర్తి " గుర్తించిన వాస్తవమేమిటి? " ఇతని కవిత సగమేమో సన్నని కలిదారి. తతిమ్మా సగం రోడ్డు. సగం పూరి గుడిసె. మిగితా సగం భవంతి. గ్రామీణ నేపథ్యం నుంచి బయలుదేరినట్లుండే కాలి బాటలాంటి కవిత కాస్తా హటాత్తుగా రోడ్డవుతుంది"
.
"వెన్నెల నీడలు" నుండి... "మో"

ఊరు డైరీ


*
ఊరి నుదుటిమీద
రాత్రి రాల్చిన చెట్ల ఆకుల బొట్టు.
పారకుండా ఆగిన ప్రవాహం ఙ్ఞాపకాలతో
మడుగులు కట్టిన బుగ్గ వాగు.
దారుల్లో నిన్నటి జీవితపు గుర్తుగా
పేడకళ్ళను వేస్తూ సాగిన గొడ్లు.
తడికలు లేక
బార్లా తెరుచుకున్న లోగిళ్ళు.
రేగడి మట్టిలో
లోపల ఎక్కడో దాహం తీరక శోషిస్తూ
గడ్డిపరక.
~
నిద్రాభంగమై చెమటను తుడుచుకుంటూ
వేడి తాళలేక చెట్ల కదలికల కోసం
వెతుక్కుంటూ ఊరు.

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...