అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

4 May 2016

Flowering Tree


This efflorescing tree
Brought in a new world into our abode
Ever since it learnt blossoming
All are appearing like wonders
In its hind, cute little birds are
Greeting with their squeaks
Resonating fragrant air
Head swinging leaves
Humming of black bees
Festive excitement all over the home
Peeping into the dwelling
like an emissary from the back yard
This efflorescing tree
Introduces ourselves to us afresh
(Kavi Yakoob, born on 2nd March 1962 holds a doctorate in Literary criticism from Osmania University, Hyderabad and holds the position of Head of the Department & Associate professor in Telugu at Anwarul Uloom Degree College, Hyderabad, Andhra Pradesh. Many of his poetic compilations and books on literary criticism have been published)

~
English Translation: Ch J Satyananda Kumar

నిదురలో నిదురించాలి !


లైట్లన్నీ ఆర్పేసిన చీకటిగదిలా మనసు .
భూమ్మీద చివరిసారిగా నృత్యంచేస్తున్న మనిషిలా
వీస్తున్న గాలి.
రంగుల్ని తుడిపేశాక, రూపాల్ని తుడిచేసాక
మిగిలిన గోడలా గతం.
సమాంతరంగా గడిపే భ్రమల క్షణాల్లో
రూపుకట్టని జీవితం.
నిజమైన ప్రపంచం లోపలెక్కడో ఉంది.
లోపలికి ప్రయాణించే దిగుడుబావి మెట్లు
కానరావు ఎంతకీ .
*
*
ఎక్కడివో కలలు :
ఎవరివైనా కానీ, కలలు నిదురలోకి ప్రవేశించాలి అసలు.
లోపలి లోయలోకి నువ్వైనా నేనైనా కొన్ని ఆకులతో ,కొన్ని పూలతో
ప్రవేశించాలి.
నక్షత్రాలమై ఆకాశం నిండా పరుచుకోవాలి మిణుకు మిణుకుమంటూ.
*
ఆ అద్దం ముందునుంచి చూపులు తిప్పి
అసలు దేహరహస్యమేదో కనిపెట్టాలి .
రహదారుల్లో మిగిలిన నలిగిన అడుగుల్లోకి
మనమిక అడుగుల్లా దూరాలి .
చివరిక్షణాల ఒంటరితనంలో
ఒకింత మనుషులమై , అల్పులమై ఆదమరచాలి.
విశ్రమించాలి , నిద్దురలో నిదురించాలి. నిదురించాలి.
*
11.2.2015

జంట కవులు


The goal of marriage is not to think alike, but to think together.. అంటాడు రాబర్ట్ డాడ్స్! 
కవి యాకూబ్, కవయిత్రి శిలాలోలిత అలాంటి జంటే! ఇద్దరి కుటుంబ నేపథ్యాల నుంచి వాళ్ల ఆలోచనా విధానం దాకా అన్నిట్లో వ్యత్యాసమే! అయినా అన్యోన్యత అనే లక్షణాన్ని వీడలేదు వాళ్ల కాపురం!
..:: సరస్వతి రమ

కాంచ్ కభీ ఝూట్ నహీ బోల్తా.. ఔర్ పర్‌ఛాయా కభీ సాథ్ నహీ ఛోడ్తీ అన్నట్టుగా అంతరాలను సరిదిద్దుకునేటప్పుడు ఈ ఇద్దరు ఒకరికొకరు ప్రతిబింబంలా ఉంటారు. క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు నీడలా తోడవుతారు! వాళ్ల పాతికేళ్ల పెళ్లి ప్రయాణంలో ఆ ఆలుమొగల మధ్య ఏర్పడిన అవగాహన అది. మూడుముళ్లు, ఏడు అడుగుల ఈ కథ ఎలా మొదలైందంటే..
మసాబ్‌ట్యాంక్ తెలుగు పండిత్ ట్రైనింగ్ క్లాసెస్‌లో..
‘మా క్లాస్‌లో అరవై మంది అమ్మాయిల్లో.. లక్ష్మే.. అంటే ఎవరో కాదు ఈమే. హుందాగా, గంభీరంగా ఉండేది. లెక్చరర్స్ కూడా తనని లక్ష్మిగారూ.. అని పిలిచేవారు. నేనూ గౌరవంగా చూసేవాడిని’ అని తన ప్రేమ పరిచయాన్ని యాకూబ్ ప్రస్తావించారు. ‘నాకూ యాకూబ్ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. చక్కగా పాటలు పాడేవాడు. ఎంత బాధ ఉన్నా మనసులోనే పెట్టుకొని అందరితో సరదాగా ఉండేవాడు’ శిలాలోలిత అంటుంటే ‘తను బాధ అంది కదా.. అది ఆకలి బాధ.. తన కోసం తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ని నాకు ఇచ్చేది’ పూర్తి చేశారు ఆయన. చిరునవ్వుతో సరిపెట్టారు ఆమె. ‘తనతో పాటు అప్పుడప్పుడు సాందీప్ అనే నాలుగేళ్ల పిల్లాడిని కాలేజ్‌కి తెస్తుండేది. వాడితో కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఎంతలా అంటే వాడి కోసమే ఈమెతో మాటలు కలిపేంతగా’ చెప్పారు యాకూబ్.
ప్రేమను బయటపెట్టుకున్నదెప్పుడు?
‘కొన్నాళ్లు పాటలు ఇచ్చి లంచ్‌బాక్స్‌లు పుచ్చుకునే వ్యవహారం నడుస్తుండగా.. ఒకరోజు ‘మీతో ఒక విషయం మాట్లాడాలి రేపు చాచానెహ్రూ పార్క్‌కి రండి’ అని చెప్పి వెళ్లిపోయింది. మనసులో నాకు ఒకటే గుబులు. నాకు తెలిసీ నేనేం అనలేదు. మర్యాదగా ప్రవర్తించాను. ఏం మాట్లాడుతుందో ఏమో సరే వెళ్లనయితే వెళ్దాం’ అని డిసైడ్ అయిపోయా’ చెప్పారు యాకూబ్.
మనసు చేసిన మోసం
‘తెల్లవారి పార్క్‌లో కలుసుకున్నాం’ యాకూబ్. ఏం చెప్పారు అన్న ప్రశ్నకు ‘నా మనసులో ఉన్నదంతా చెప్పాను’ ముక్తసరిగానే అన్నారు శిలాలోలిత. మనసులో ఏం ఉండింది అని రెట్టిస్తే ‘నన్ను మీరు ఇష్టపడుతున్నారల్లే ఉంది. కానీ అది కుదరదు. నాకు పదకొండో ఏటే పెళ్లయింది. ఓ బాబు పుట్టాక విడాకులు కూడా అయ్యాయి. అప్పుడప్పుడూ నా వెంట వచ్చే సాందీప్ నా కొడుకే. కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. అలాంటి ఆలోచన ఉంటే మరచిపోండి’ అని చెప్పాను. ‘ఆ మాటలు విని ముందు ఆశ్చర్యపోయా. తన గతం విని కాదు. తనకు నాపై అలాంటి అపోహ ఏర్పడ్డందుకు. లక్ష్మిగారు.. మీపై నాకలాంటి ఉద్దేశం లేదు. మీకలా అనిపిస్తే సారీ’ అన్నాను’’ యాకూబ్ చెప్తుంటే ‘అందుకే దాన్ని మనసు చేసిన మోసం అంటాను’ అన్నారు శిలాలోలిత. ‘కానీ ఆ రోజు నుంచి లక్ష్మి మీద మరింత గౌరవం పెరిగింది. తను నాకన్నా ఆరేళ్లు పెద్ద. ఆమె వ్యక్తిత్వం ముందు ఆ బేధాలన్నీ బలాదూరయ్యాయి. సాందీప్‌కి నాకూ మధ్య అనుబంధమూ బలపడటం మొదలైంది. బహుశా అది ప్రేమ కావచ్చు’ యాకూబ్. ‘కానీ, టీపీటీ ట్రైనింగ్ అయిపోయే వరకూ బయటపడలేదు. ఎంఫిల్‌కి ఇద్దరం రాజమండ్రి వెళ్లాం. అక్కడ గోదావరి తీరం, సాహిత్య పరిచయాలు, కవి సమ్మేళనాలు.. మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి తెచ్చాయ్’ శిలాలోలిత.
పెళ్లికి పెద్దల అంగీకారం?
‘నేను కేఎల్, దుర్గమ్మ దంపతులకు ఒకరకంగా దత్తపుత్రుడిని. నా మంచిచెడ్డలన్నీ వాళ్లే చూశారు. ఈమెతో పెళ్లికూడా దుర్గమ్మ గారి అంగీకారంతోనే జరిగింది’ అని యాకూబ్ చెప్తుంటే ‘తను ముస్లిం అని మా నాన్న అభ్యంతరపెట్టారు. ‘మొదటి పెళ్లి మీ ఇష్టప్రకారం చేశారు. ఏమైంది? అందుకే ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని చేసుకోనివ్వండి’ అని కాస్త కఠినంగానే చెప్పాను. ఒప్పుకున్నారు’ అని గతం గుర్తుచేసుకున్నారు ఆమె. ‘పెళ్లయ్యాక కాపురానికి వస్తుంటే వీళ్ల నాన్న సాందీప్ మాతోనే ఉంటాడు’ అన్నాడు. వీల్లేదు. మాతో ఉండాల్సిందే’ అన్నాను. నిజానికి నేను ఈవిడను పెళ్లాడింది వాడికోసమే’ చెప్పారు యాకూబ్.
మరి పెళ్లితర్వాత గొడవలు, అలకలు..?
‘మాదంతా బాధ్యతల పంపకమే. గొడవలు, అలకలు అంతగా లేవు’యాకూబ్. సాందీప్ విషయంలో ఆయన కర్తవ్యాన్ని ఎలా మరిచిపోలేదో.. యాకూబ్ వాళ్లింటి విషయంలో నా బాధ్యతనూ నేను మరచిపోలేదు. చాన్నాళ్లు ఇద్దరికీ ప్రైవేట్ ఉద్యోగాలే. నాలుగు నాలుగు కాలేజీల్లో పాఠాలు చెప్పేవాళ్లం. ఇంట్లో మాతోపాటు ఆరుగురు పిల్లలు (వాళ్లన్నయ్య పిల్లల్నీ ఇక్కడకు తెచ్చేసుకున్నాం చదువుల కోసం).. మా శక్తికి మించి బాధ్యతలను మోసినా నేనెప్పుడూ మానసిక వ్యథను అనుభవించలేదు. యాకూబ్ నా పక్కనున్నాడన్న ధైర్యం నాది’ అని ఆమె, ‘లక్ష్మి నాకు తోడుందన్న గర్వం నాకుండేది’ ముగించారు యాకూబ్.
కల్చరల్ డిఫరెన్సెస్..
‘మా ఇద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు’ అంటారిద్దరూ. ‘యాకూబ్‌కి ఇల్లు నీట్‌గా ఉండడం ఇష్టం’ అని ఆమె అంటుంటే ‘హౌస్ కీపింగ్‌లో ఆమె వీక్. నేను స్ట్రాంగ్’ అని ఆయన. ‘యాకూబ్ అందరినీ ఇట్టే నమ్మేస్తాడు’ అని అతని బలహీనత చెప్పారామె. ‘అర్హులకే సహాయం చేయాలంటుంది ఆమె’ అంటూ తన బలహీనతను సర్దిచెప్పుకున్నారు ఆయన.
కవిత్వంలో విమర్శలు..
‘పెద్ద వ్యాక్యాలు రాస్తుంది’ అని ఆయన, ‘అది నా శైలి’ అని ఆమె.. ‘సరిదిద్దితే.. నా రాతనే మార్చేశాక ఇది నాది ఎందుకవుతుంది నీదే’ అంటూ పడేసి వెళ్లిపోతుంది. వ్యాసాలు బాగా రాస్తుంది’ అని ఆయన ప్రశంస, ‘పాటలు అద్భుతంగా పాడ్తాడు’ అని ఆమె ప్రశంస. ‘నా తీరని కోరిక తనతో సారీ చెప్పించుకోవాలని’ అని ఆయన.. ‘నా తప్పులేంది సారీ అస్సలు చెప్పను ’ అని ఆమె.. మొత్తానికి ఇద్దరి మధ్యకు వచ్చే ఏ వాదనైనా చివరకు వాళ్ల అన్యోన్యతను చూసి తప్పుకొనైనా వెళ్తుంది లేదంటే ఇద్దరూ ఒకే మాటమీదకు వచ్చే అద్భుతమైన కన్‌క్లూజనైనా ఇస్తుంది! ఇదీ కుల మత వయసులకతీతమైన యాకూబ్, శిలాలోలితల ప్రేమబంధం!

~ sakshi -You and I ,special Article 10.1.2015

అక్షరాల చెట్టు


 
photo by Kandukuri Ramesh Babu 
+అక్షరాల చెట్టు కవి యాకూబ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు +

అక్షరాల చెట్టు
♧♧♧♧♧

అతనొక మామూలు మనిషే
కాకుంటే తోటి మనుషుల పట్ల
కాస్త ప్రేమను చూపిస్తాడు.

కొండకచో కొందరి వాత్సల్యాన్ని చూరగొని
జీవితాంతం బద్రంగా దాచుకుంటాడు
తడుముకుంటూ ఆనందిస్తాడు
వారి కోసం తన జీవితాన్ని కానుకిస్తాడు.

మట్టిని నమ్మిన మనిషి
అందుకే మట్టిలో నుండే మాణిక్యాలను
వెలికితీస్తాడు
అవి వెలుగుతూ వుంటే
వాటి వెలుగులో తన బొమ్మను
చూస్తూ పసి వాడిలా సంబరపడతాడు

కొంచెం సామాజిక స్పృహ ను
కల్గిన కవితలు రాస్తాడు
సమాజంలో తనతో పాటు
ఓ నలుగురి బాగు కోసం తపన పడతాడు

అప్పుడప్పుడు విమర్శలకు ఆహారమవుతాడు
దాన్ని తానే ముందు వరుసలో వుండి లైక్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తాడు.
జీవితమంటే తీపి కాదు
చేదే ఎక్కువ అని నిరూపిస్తాడు

రొట్టెమాకు రేవు రొట్టెలు తిన్న మనిషికి
మానవత్వం
మట్టితనం
కాక ఇంకేం వుంటయ్...

చెట్టు విత్తవుతుంది
ఆ విత్తు మరో వృక్షమవుతుంది
పిట్టలు వాలుతనె వుంటయ్
ఉశిల్లలెక్క...

(సంవత్సరం కిందట రాసిన కవిత)
యాకూబ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో...

Ravinder Vilasagaram‎
March 2,2016 

శుభా కాంక్షలు

Swechchaa Manavathanath Roy‎
March 2,2016

క్షీర నీర న్యాయం పాటించే హంస
పూల తేరుమీద పయనించే మధురోహల సందోహం
ఎండి పోయిన వృక్షాల కి కవితా వసంతాన్ని ప్రసాదించిన

ఫేస్ బుక్ ని వచన కావ్యం గా చేసిన 
కవి యాకూబ్ గారికి
తెల్లని మల్లెల మనస్సు గల
ఓ మంచి మనిషికి జన్మ దిన శుభా కాంక్షలు
పచ్చని చెట్టు పై వాలే శబ్ద అర్థ సౌందర్య పిపాసక శుక పికాలు
మీ శ్లోకాలు

~ మార్చి 2,2016

మాట్లాడాడు...మాట్లాడాడు..మాట్లాడుతూనే ఉన్నాడు..

Kavi Yakoob 





నరేష్కుమార్ ఎస్.
March 2,2016
మాట్లాడాడు...మాట్లాడాడు..మాట్లాడుతూనే ఉన్నాడు... ఒక వేపచెట్టూ, మేమూ..అప్పుడప్పుడూ మొక్క జొన్న పైరు మీదినుంచి వీచే గాలీ... చుట్టూ వెలుతురుని దాచేసిన చీకట్లో పాడే కీచురాళ్ళు.... ఆ రాత్రంతా ఆయనా నేనూ అలా కూర్చునే ఉన్నాం ... మరిచిపోలేని ఙ్ఞపకాల్లో ఆరోజు కూడా ఒకటి..

//ఒక జీవించాక//

అతనిప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు
ఒక జీవితపు ఒడ్డున కూర్చుని బతుకు ప్రవాహంలో కాళ్ళనాడిస్తూ
మాట్లాడే చెట్టులా లేదూ ఒక ప్రాచీన భాషలా తన కతని
చెప్తూనేఉన్నాడు
తెరలు తెరలుగా తన బాల్యపు ఙ్ఞాపకాల్లోని
కొన్ని అమ్మచేతి దెబ్బలని మళ్ళీ అనుభవిస్తున్నంత
అనుభూతితో అలా చెప్తూనే ఉన్నాడు
"నాకు మాట్లాడే ఒక మనిషి కావాలి" అంటూ
ఎప్పట్లానే సంభాషణని మొదలుపెట్టాడు

కొన్ని వాలిపోయిన గోడల్లాంటి మనుషులని కౌగిలించుకుంటూనే
అలసిన ఆ ముసలి దారులని దుప్పటిలా మడతేసుకుంటూ
పశువుల వెంట కావలి కుర్రవాడిలా కొన్ని క్షణాలు జీవించాక
కొల్పోయిన తండ్రిని గుర్తు తెచ్చుకొని
రెండు కన్నీటి బిందువులపాటు నిట్టూర్చాడు
ఆవుపాలంత స్వచ్చంగా కాదుగానీ పంటచేల కావలి రాత్రులంత చిక్కని చీకటిగా..
లేదూ..! ఎండాకాలపు సెగలు కక్కే రోడ్డుని పొలినంత నల్లని,
అమాయకపు ప్రేమలని చెప్తూ
ఒక వాగుఒడ్డు పై కూర్చుని
వచ్చీపోయె నేలలని ఆప్యాయంగా పలకరించాలనే
ఒక పచ్చి చిగురాకు నీడలా
చలించిపోతూనే ఉన్నాడు

ఆ వేపచెట్టుని కౌగిలించుకుని ఆ పాత ఇంటివాసనతో
తడిసినగోడల వాసనతో మొహం కడుక్కుంటూ
తనలా అచ్చంగా తనలా జీవించే కథని మళ్ళీ
జీవిస్తూ.....
మొక్కజొన్న చేల మీదుగా వచ్చిన రైలుశబ్దంతో
కలిసిపోతూ మళ్ళీ మళ్ళీ నాట్యం చేస్తూ
చె
ప్తూ
నే

న్నా
డు....
బహుశా...! అతనికి ఇక్కడ... ఆ చిన్న ఊరిలో ఉన్నప్పుడు
శ్రోతలెవరూ అవవసరముండదేమో
అతను తననుతాను ప్రేమించటానికి
లేదూ...! చుట్టూ ఉన్న మనుషులని ప్రేమించటానికి తన కథగా జీవిస్తూండవచ్చు...
కొందరు మనుషులుగా విడిపొయిన ఒక్క జీవితాన్ని మళ్ళీ వాంచిస్తూ ఉండవచ్చు....
అతనా ముప్పై ఇళ్ళ కుగ్రామాన్ని ఒక ప్రపంచంగా మలుచుకునే
శిల్పిగా ఒక జన్మని కోరుకొనీ ఉండవచ్చు...
ఆ పిల్లిగెడ్డపు వ్యక్తి...! నేనూ అవొచ్చు లేదా ఒక పల్లెని విడిచిన నువ్వూ ఐ ఉండవచ్చు....


(ఒక్కరోజు యాకుబ్ గారి గ్రామం రొట్టమాకు రేవులో రాత్రిపూట వేపచెట్టుకింద ఆయనతో మాట్లాడాక)

కవిత్వ నిబద్ధత


కవి యాకూబ్ 
Wahed Abd
March 2
సాధారణంగా పుట్టిన రోజుల పట్ల పెద్దగా ఆసక్తి నాకు లేదు. అందువల్ల చాలా మంది మిత్రుల కోపతాపాలు కూడా భరించవలసి వస్తుంది. పుట్టినరోజులు గుర్తు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పడం చాలా మంది చాలా శ్రద్ధగా చేస్తారు. కాని పుట్టినరోజు జరుపుకునే అలవాటే లేని నాకు మిత్రులకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్న స్పృహ కూడా సహజంగా ఉండదు కదా.
కాని నా ఈ అలవాటు ఈ రోజు చాలా బాధపడేలా చేసింది. ఫేస్బుక్ తెరిచి చూడగానే అన్న యాకూబ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది పెట్టిన పోస్టులు చూసి కాస్త సిగ్గుపడ్డాను. నేను ముందుగా శుభాకాంక్షలు చెప్పవలసిందే అనిపించింది. ఆలస్యమైనా సరే ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు యాకూబ్ తో నా పరిచయాన్ని కాస్త నెమరువేసుకుంటూ మీతో పంచుకోవాలనిపించింది.

యాకూబ్ ... ఈ పేరు మొదట నేను విన్నది, తెలుగులో ఎలా రాయాలో నాకు నేర్పిన గురువుగారు మలిక్ గారి నోట. బహుశా 1992లో అనుకుంటాను, అప్పటికి నేను గీటురాయి వారపత్రికలో పనిచేస్తున్నాను. మలిక్ గారు ఎడిటర్. ఒక రోజు సాయంత్రం ఆయన ’’ఈ వాళ యాకూబ్ పుస్తకావిష్కరణ ఉంది, నేను వెళుతున్నా, నువ్వు వస్తావా‘‘ అన్నారు. నాకు మ్యాగజైన్ పని పూర్తి కాలేదు కాబట్టి రాలేనన్నాను.
క్యాఖూబ్ అనిపించుకున్న యాకూబ్ అని ఆ తర్వాత ఆయన రాశాడు. చేరాతలు శీర్షికన చేకూరి రామారావు గారు రాసిన వ్యాసంలోను యాకూబ్ ను అలాగే అభినందించారు ’’బహుత్ ఖూబ్ యాకూబ్‘‘ అన్నారాయన. అలా యాకూబ్ పేరు నాకు పనిచయమైంది అప్పుడు ఆవిష్కరణ జరిగిన పుస్తకం ’’ప్రవహించే జ్ఙాపకం‘‘
గీటురాయి కార్యాలయానికి అప్పట్లో దేవిప్రియగారు తరచు వస్తుండేవారు. మలిక్ గారికి ఆయనకు మధ్య చాలా గాఢమైన స్నేహం. దేవిప్రియ గారితో పాటు చేకూరి రామారావు వంటి పెద్దలు కూడా వస్తూ ఉండేవారు. అలా యాకూబ్ కూడా గీటురాయి కార్యాలయానికి రావడం, ఆయనతో పరిచయం, స్నేహం దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి.

యాకూబ్... కేవలం మిత్రుడు మాత్రమే కాదు, స్వంత అన్నలాంటి వాడైపోయాడు. ఇన్ని దశాబ్ధాల కాలంలో ఎప్పుడు కలిసినా అదే అప్యాయత.. అరేయ్.. అంటూ పిలిచే పిలుపులో అదే ప్రేమ. ఆయన మాట్లాడుతుంటే తొలకరిలో నేల గుబాళింపులాంటి అనుభూతి. యాకూబ్ ఒక కవి మాత్రమే కాదు, ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఆయన ఒక కవిగానే కాదు, ఒక కవితగా బతుకుతున్నట్లే నాకు కనబడింది.
అట్టడుగు స్థాయిన నుంచి వచ్చిన వాడు, మట్టి విలువ తెలిసినవాడు, ఉడుకుతున్న అన్నం మెతుకు వాసనలాంటి వాడు. ఈ రోజు అధ్యాపకుడిగా, కవిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నప్పటికీ తాను అనుభవించిన జీవితాన్ని, గతాన్ని, గతంతో తన అనుబంధాన్ని, ఒక్క క్షణం పాటు కూడా మరువని కవిత్వ ప్రవాహం యాకూబ్.
కవిత్వం రాయడమే కాదు, తెలుగు కవిత్వాన్ని, వర్ధమాన కవులను ప్రోత్సహించడానికి ఆయనెల్లప్పుడు చాలా ఆసక్తి చూపించేవాడు. కవిసంగమం గురించి మాత్రమే కాదు నేను చెప్పేది. నాకు యాకూబ్ పరిచయం అయినప్పుడు కవిసంగమం కాదు కదా అసలు ఇంటర్నెట్ వాడకమే పెద్దగా లేదు. అప్పుడు కూడా ఒకటి రెండు నా కవితలు చదివి ఇంకా రాసేలా ప్రోత్సహించేవాడు. ఎవరైనా ఒక మంచి కవిత రాస్తే అదేదో ఆయనే రాసినంతగా సంబరపడిపోవడం, కవిగా ఎవరికైనా పేరు వస్తే ఆ పేరేదో తనకే వచ్చినట్లు సంతోషపడిపోవడం బహుశా మరెవ్వరూ చేయలేరేమో. దశాబ్ధాలుగా యాకూబ్ నాకు అలాగే తెలుసు. దశాబ్ధాలుగా ఆయన స్వయంగా కవిత్వం రాయడం, తెలుగు కవిత్వంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు, తెలుగు కవిత్వంపై తనదైన ముద్ర వేశాడు. మరోవైపు అనేకమందిని కవిత్వం రాసేలా ప్రోత్సహిస్తూ వచ్చాడు. కవిత్వాన్ని ప్రోత్సహించాలన్న ఆయన తపన ఎలాంటిదంటే, ప్రతి మార్గాన్ని, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసేవాడు. 
kavisangamam

ఇంటర్నెట్, ఫేస్ బుక్ వచ్చిన తర్వాత ఫేస్ బుక్ వేదికగా తెలుగు కవిత్వాన్ని ప్రోత్సహించగలమన్న ఆలోచన ఆయనలో కలిగిందంటే దానికి కారణం ఆయనలో ఉన్న ఈ తపనే. కవిసంగమం పేరిట ఒక ఫేస్ బుక్ గ్రూపు ప్రారంభించాడు. తెలుగులో కవిత్వం రావడం లేదు. తెలుగులో కవిత్వానికి భవిష్యత్తు లేదనుకునే సమయంలో కవిసంగమం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. తెలుగులోకవిత్వం పట్ల ఎంత ఆసక్తి, ఆదరణ ఉందో కవిసంగమం నిరూపించింది. ప్రతినెల రెండవ శనివారం కవిసంగమం పొయట్రీ రీడింగ్ కార్యక్రమాలను తన స్వంత ఖర్చులతో నిర్వహిస్తూ తెలుగులో ఒక కవిత్వ వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఏటా కవిత్వ పండుగలను కూడా, ఖర్చుకు వెనుదీయక నిర్వహించిన ధైర్యం యాకూబ్ ది. ఇతర భాషల్లో లబ్ధప్రతిష్ఠులైన కవులను ఆహ్వానించి నిర్వహిస్తూ వస్తున్న కవిత్వ పండుగలు తెలుగులో కవిత్వం భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉందో నిరూపించాయి. బుక్ ఫెయిర్లలో కవిత్వ పుస్తకాలు విరివిగా అమ్ముడు కావడం ప్రారంభమయ్యింది. కవిత్వాన్ని ఆదరించేవారి సంఖ్య పెరిగింది. కవిత్వం చదివేవారి సంఖ్య పెరిగింది. కవిత్వం రాసే వారి సంఖ్య పెరిగింది. కవిసంగమంలో కొత్త కొత్త శీర్షికలు ప్రవేశపెట్టి అనేకమందిని ప్రోత్సహించి ఆ శీర్షికల్లో రాసేలా చేయడం ద్వారా వర్ధమాన కవులకు చాలా ఉపయోగకరంగా మారింది. నెల నెల నిర్వహించే పొయట్రీ రీడింగ్ కార్యక్రమాల్లో మూడు తరాల కవులు కలుసుకోవడం, వర్ధమాన కవులకు సీనియర్ కవుల సలహా సూచనలు లభించడం, వారికి అవసరమైన ప్రోత్సాహం దొరకడం ఇవన్నీ తెలుగులో కవిత్వ పూదోట మళ్ళీ వికసించడానికి కారణమయ్యాయి.
నేను అనేక సార్లు చెప్పినట్లు నేడు నేను కవిత్వం రాయడానికి కారణం కూడా యాకూబే. ఎప్పుడో తొంభైలలో కవిత్వం రాసిన నేను ఆ తర్వాత బతుకు పోరాటంలో కవిత్వానికి దూరం కావలసి వచ్చింది. కవిసంగమం ప్రారంభించిన కొత్తలో నా వ్యక్తిగత పనిమీద యాకూబ్ ను కాలేజీలో కలవడానికి ఒకసారి వెళ్ళాను. నా పని చేసిపెడుతూ, ల్యాప్ టాప్ తెరిచి కవిసంగమం గురించి పూర్తి డెమో ఇచ్చాడు. అప్పుడు నేను టి.వీ.మీడియాలో పనిచేస్తున్నాను. కవిసంగమం గురించి చెప్పిన యాకూబ్ నువ్వు మళ్ళీ కవిత్వం రాయి. రాయడం ఎందుకు ఆపేశావు అని తనకు సహజంగా నాపై ఉండే అభిమానంతో కాస్త కోపంగానే చెప్పాడు. కానీ, నాకున్న పని ఒత్తిళ్ళ వల్ల అప్పట్లో నేను కవిసంగమంలోకి రావడం కాని, కవిత్వం రాయడం కాని జరగలేదు. 

ఆ తర్వాత రెండు సంవత్సరాలకు కాని నేను కవిసంగమం గ్రూపును చూడలేదు. చూడగానే ఇంతమంది కొత్తవాళ్ళు కవిత్వం రాస్తున్నారా అని ఆశ్చర్యం కలిగింది. నేను ఎప్పుడో రాసిన ఒక కవితను పోస్టు చేశాను. వెంటనే దానికి ప్రతిస్పందనలు వచ్చాయి. ఇది ఇంటర్నెట్ ఫాస్ట్ యుగం, పత్రికలో కవిత అచ్చయ్యేవరకు ఆగవలసిన పనిలేదు. ఆ తర్వాత దానిపై ప్రతిస్పందనల లేఖలు ప్రింటయ్యే వరకు వేచి ఉండవలసిన పని లేదు. ఇదేదో బాగుందే అనిపించింది. కవిసంగమంలో ఒకటి రెండు కవితలు, కొన్ని గజల్సు రాసిన వెంటనే యాకూబ్ ఉర్దూ కవిత్వాన్ని తెలుగులో అనువదించి ఇవ్వవచ్చు కదా అని కొత్త ప్రతిపాదన పెట్టాడు. ప్రతిపాదన పెట్టడం మాత్రమే కాదు, చేయిపట్టి రాయించినంత పని చేశాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కవిత్వం పట్ల ఆయనకున్న నిబద్దత. ఇరవై నాలుగు గంటలు కవిత్వాన్ని శ్వాసిస్తుండడం వల్లనే ఆయన నాతో ఏం రాయించాలన్న విషయమై ఆలోచించగలిగాడు. ఆ విధంగా కవిసంగమంలో రాయడం వల్లనే నేడు ఫైజ్ అహ్మద్ ఫైజ్ పైన ఒక పుస్తకం అచ్చయ్యింది. మక్దూం పై మరో పుస్తకం అచ్చుకు సిద్ధంగా ఉంది. కొత్త కవుల కవిత్వాన్ని నారాయణశర్మ వంటి విమర్శకుడితో విశ్లేషణ చేయించి, ఈనాటి కవిత శీర్షికన కవిసంగమంలో రాయించడం, ఆ విశ్లేషణలన్నీ పుస్తకంగా అచ్చేయించడం ఇవన్నీ ఆయనకు కవిత్వం పట్ల ఉన్న మక్కువకు నిదర్శనాలు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. తెలుగు చేసిన యాకూబ్, హైదరాబాదులో తెలుగు పండిత శిక్షణ కూడా పొందాడు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం నుంచి ’’తెలుగు సాహిత్య విమర్శలో రారా మార్గం‘‘ అనే అంశంపై పరిశోధనా పత్రం రాసి ఎం.ఫిల్ పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ’’తెలుగు సాహిత్య విమర్శ ఆధునిక ధోరణలు‘‘ అనే అంశంపై పిహెచ్డీ చేశాడు.
తెలుగులో కవులను కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలతో పాటు తన కవిత్వాన్ని కూడా అశ్రద్ధ చేయలేదు. ప్రవహించే జ్ఙాపకం తర్వాత సరిహద్దు రేఖ, ఎడతెగని ప్రయాణం, నదీమూలం లాంటి ఇల్లు కవిత్వ సంపుటులు వేశారు. తెలంగాణ సాహిత్య విమర్శ పేరుతో సాహిత్య వ్యాసాలు రాశాడు.
ఫ్రీవర్స్ ఫ్రంట్, రంజనీ కుందుర్తీ అవార్డు, ఎస్.వి.టి.దీక్షితులు అవార్డు, అమిలినేని లక్ష్మీరమణ స్మారక ధర్మనిధి పురస్కారం, కె.సి.గుప్తా సాహిత్యపురస్కారం, డా.సి.నా.రె.కవితాపురస్కారం, నూతలపాటి గంగాధరం సాహిత్యపురస్కారం, ఉత్తమ కవిత్వం అవార్డు , రాష్ట్ర ఉత్తమకవి అవార్డులు అందుకున్నాడు.
కవిత్వాన్ని ప్రోత్సహించడమే కాదు, పల్లెల్లో గ్రంథాలయాలను, కవిత్వ పఠనాన్ని ప్రోత్సహించాలని నడుం కట్టి తన స్వంత ఊరు రొట్టమాకు రేవులో ఆ కార్యక్రమానికి పునాది వేశాడు.
రొట్టమాకు రేవు ఒక మారుమూల పల్లె. దానికి కవిత్వ ప్రపంచంలో ఒక గుర్తింపు ఇవ్వాలనుకున్నాడు. ఆధునికత పెరిగిపోయిన మనం మన వేర్ల నుండి దూరమైపోతున్నామన్న బాధ యాకూబ్లో ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. మనం మన ఊళ్ళ నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినా ఊరు మనకు అంత దగ్గరగా వస్తూనే ఉంటుంది. ఎన్నెన్నో జ్ఙాపకాలు రొట్టమాకు రేవులోని బుగ్గవాగులా సదా మదిలో పారుతూనే ఉంటాయంటాడు యాకూబ్. 

కేరళలోని తుంచన్ కవి స్మారకంగా కట్టిన తుంచన్ మెమోరియల్ ట్రస్ట్, కుమారన్ ఆసన్ స్మారక కేంద్రం, హైదరాబాదులోని లామకాన్, గోల్డెన్ థ్రెషోల్డ్ లను చూసిన తర్వాత యాకూబ్ మదిలో రొట్టమాకు రేవును కూడా ఒక సాహిత్య కేంద్రంగా మార్చాలన్న ఆలోచన వచ్చింది. కేరళ, కర్నాటక, ఉత్తరభారత దేశాల్లో గ్రామీణ సాహిత్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పల్లెలు సాహిత్య కేంద్రాలుగా ఎదగాలని కలగన్నాడు. ఆ కలను సాకారం చేయడానికి రొట్టమాకు రేవులో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక కేంద్రం ఏర్పాటు చేయాలనుకున్నాడు. అనేక ప్రాంతాలకు, పల్లెలకు ఒక కల్చరల్ పొయట్రీ స్పేస్ గా ఇది స్ఫూర్తి నివ్వాలన్నది ఆయన ఆలోచన. కవిత్వం రాయడం, చదవడం మాత్రమే సరిపోదు ఒక కవిత్వ వాతావరణాన్ని ఏర్పరచుకోవాలంటాడు యాకూబ్. అదొక ప్రక్రియలా నిరంతరం కొనసాగుతూ ఉండాలంటాడు. అందుకే రొట్టమాకు రేవులో ఒక గ్రంథాలయాన్ని, ఒక పొయట్రీ స్పేస్ ఏర్పాటు చేసి, రొట్టమాకు రేవు కవిత్వ అవార్డులను కూడా ప్రకటించాడు. తన తండ్రి షేక్ ముహమ్మద్ మియా, కే.ఎల్.నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డులను అక్కడ ప్రతి సంవత్సరం ప్రకటించడం ప్రారంభించాడు. ఒక మారుమూల పల్లె పేరుతో అవార్డుల కార్యక్రమం జరపడం వల్ల పల్లెలకు సాహిత్య ప్రపంచంలో ప్రాముఖ్యం పెంచాలన్నదే ఆలోచన.
సౌభాగ్య, అరుణ్ సాగర్; షాజహానా, నందకిశోర్, నందిని సిధారెడ్డి, మోహన్ రుషి, హిమజలకు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. 

పేరులోనే కవిని చేర్చుకుని కవిత్వంగా బతుకుతున్న యాకూబ్ తెలుగు కవిత్వంలో అక్షరమై వెలుగొందుతున్నాడు. ఈ అక్షరం మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని, తెలుగు కవిత్వానికి మరింత శోభ సంతరించాలని మనసారా ఆశిస్తూ....పుట్టిన రోజు శుభాకాంక్షలు.

~ వాహెద్ 
మార్చి 2, 2016 

జయహో

స్పూర్తి ప్రదాతకు జయహో

నదీ మూలం లాంటి ఇంటి నుంచి నగరానికి చేరి , వర్ధమాన కవులకు పచ్చని చెట్టులా మారిన Kavi Yakoob కు జన్మదిన శుభాకాంక్షలు. 1982 లో ఖమ్మం సిద్దారెడ్డి కాలేజీలో పరిచయమైన నాటి నుంచి నేటి వరకు స్నేహం పంచటమే తప్ప, ఏనాడూ ద్వేషం ఎరుగని బోలాశంకరుడికి ప్రేమ పూర్వక అభినందనలు.
ఇరవై ఏళ్ళ పాటు వ్యాపారంలో తనమునకలై, సాహితీ ప్రపంచానికి దూరమైన నేను జనజీవనం లోకి తిరిగొచ్చాక ప్రేమతో ఆలింగనం చేసుకున్నది కవిసంగమం. యాకుబ్ నెలకొల్పిన ఆ సంస్థ, దాని కార్యక్రమాలు నేను తోపుడుబండి పెట్టడానికి స్పూర్తినిచ్చాయి. తోపుడుబండి తోలినినాదం జయహో కవిత్వం అనేది యాకుబ్ సృష్టే. బండి మొదలైన నాటి నుంచి నేటి వరకు బండికి ఇంధనంగా పనిచేస్తున్నాది నా మిత్రుడే.
ఈరోజు పల్లెకుప్రేమతో ..అంటూ గ్రంధాలయ ఉద్యమం ప్రారంభించడానికి కూడా స్ఫూర్తి యాకూబే. తన సొంత ఊరు, ఒక మారుమూల పల్లె రొట్టమాకురేవు . గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రంధాలయాలు అవసరం అని గుర్తించి సొంత ఖర్చుతో అక్కడ ఒక గ్రంధాలయాన్ని స్థాపించాడు. ఆ కార్యక్రమానికి హాజరైనప్పుడే ఊరూరా గ్రంధాలయాలు పెట్టాలనే ఆలోచనకు బీజం పడింది. ఆ ఆలోచనే పెరిగి పెద్దదై ‘మనవూరు-మన గ్రంధాలయం’ అనే నినాదంగా మారింది. ఈరోజు తెలుగు నేలపై తిరుగుతున్న ‘పల్లెకు ప్రేమతో..తోపుడుబండి’ యాత్రకు నేపధ్యం అదే.

లవ్ యూ రా బాబాయ్.....మరోసారి దిల్ సే జన్మదిన శుభాకాంక్షలు.


~సాదిక్ అలీ 
మార్చి 2,2016 

Happy birthday

Design by Akbar
మనుషులు కాలాన్ని మారుస్తూ పోతుంటారు.. అనుగుణంగానో.. అడ్డదిడ్డంగానో.. బాటంటూ మలచబడ్డాక..! నిస్సహాయులదీ అదే తొవ్వ. గ్లోబలైజేషన్ ప్రపంచ నేపథ్యాన్ని మార్చేసిన తర్వాత.. ముఖ్యంగా ఇప్పటి యూత్ కనెక్ట్ అవడానికి హైటెక్-పబ్బులు, డిస్కోలు, కమర్షియల్ సినిమాలు ఉన్నాయి తప్ప, ఓ నాలుగు మంచి వాక్యాలు.. ఓ నలుగురు మంచి పెద్ద మనుషుల్ని కలవడానికి వేదికంటూ లేకుండా పోయింది.
.... ..... ....
ఇలాంటి పరంపరలో యాకూబ్ సార్ నాటిన విత్తు 'కవిసంగమం'. మూలాల్ని ఆధునికతతో కనెక్ట్ చేయడానికి ఆయనెంత తపించి ఉంటే.. ఈ వేదిక ఏర్పాటు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఎంతోమందిని అక్కున చేర్చుకుని
ఎంతోమందికి అక్షర జ్ఞానం పంచుతూ.. భావి తరానికి ఓ భవిష్యత్తు సాహితీ వారథిని నిర్మించిన మీకు సలాం సార్. happy birthday sir, and may you have many more years of poetic bliss.

~శ్రీనివాస్ సాహి
మార్చి  2,2016 

హ్యాపీ హ్యాపీ బర్త్ డే

Yakoob by  Giridhar arasavalli

అమ్మ కంటుంది,ఊరు పెంచుతుంది
బహుషా ఆ అమ్మ ఊహించి ఉండదు
తానో కవిత్వస్వాప్నికున్ని కంటుందని
ఆ ఊరు అనుకుని ఉండదు
తానో నడిచే గ్రంధాలయాన్ని మోస్తుందని
ఓ మహర్షీ...
ఎన్ని కవితలకు పురుడు పోసావ్
ఇంకెంతమంది కవులకి ప్రాణం పోసావ్
అమ్మవై పోయావు కదయ్యా...

ఎక్కడి నుంచి తెచ్చుకున్నావయ్యా
ఈ తేజస్సు
అంతందంగా ఎలా కలిపేసుకున్నావయ్యా అందర్నీ నీలో
ప్రేమగా నువ్వు నిమిరితే మాకు నాన్న గుర్తొస్తాడయ్యా
నీ శరీరం
ఉట్టి మాంసపు ముద్దపై కప్పుకున్న చర్మం కాదు
నరనరాల్లో కవిత్వాన్ని, మనిషి తనాన్ని
నింపుకుని
అక్షరాలకు కవిత్వాన్ని చుట్టుకున్న దేహం నీది..

నీకు తెలుసా
మీరంటే ఎంత మందికి ప్రేమతో కూడిన ఆరాధనో...
రేపటి చరిత్రలో ఖచ్చితంగా రొట్టమాకురేవు
సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది
నిను మోసిన నీ ఊరు
ఇప్పుడు మోస్తున్న గుండెలపై
యాకూబ్ అనే పేరు పచ్చ బొట్టై పోతుంది...
ఇదంతా మాకు
నీ ఊరు నుదిటిన నువ్వు అద్దిన అక్షరతిలకం(అదే సారూ రొట్టమాకురేవు గ్రంధాలయం ) చెప్తుంది...

హ్యాపీ హ్యాపీ బర్త్ డే యాకూబ్ సర్ ( Kavi Yakoob💞💕💟💞...Siddhardha katta

మార్చి2,2016 

ఆ తర్వాత


March 11, 2015 at 8:47am
కొన్నాళ్లు గడిచాక 
రూపం కోల్పోయి గాలిలో కలిసాక
చిన్నప్పుడు ఆటలలో గెలుచుకున్న గోళీకాయలేవో
జేబులో శబ్దం చేస్తుంటాయి.

తుమ్మచెట్టు బెరడునుంచి కారి, మెరిసే బంక 
నాలిక మీద వింత రుచిని గుర్తుచేస్తుంటుంది.

కొంగలు వాలిన చింతచెట్ల అర్ధరాత్రి శబ్దాలేవో 
వింత వింత స్మృతులై తెల్లటి ఈకల్లా ఎగురుతుంటాయి.

బుడబుడ శబ్దాల వాగు 
దేహపు బండరాళ్ళ మీద తలమొాదుకుంటున్నట్లు
అదేపనిగా అరుస్తూనే వుంటుంది.

రైలుపట్టాల కింది కంకరరాళ్ళు 
బాల్యాన్ని పాదాలుపాదాలుగా మార్చుకుని
తమ మీద దుప్పటిగా కప్పుకుంటాయి.

ఆ పిదప తీగలచింత 
నిన్నో ఙ్ఞాపకంగా తనకొమ్మల మీద కూచోబెట్టుకుని
గాలితో ఆడిస్తుంది.

10.3.2015* Posted in Kavisangamam

యాకూబ్ కవిత-నా పరామర్శ




సహజంగానే ఉందాం
చల్లని గాలిలా ఉందాంప్రేమలా ఉందాం
నిప్పుకణికలా ఉందాం
నిలువెత్తు నిజంలా ఉందాం
సహజంగా ఉందాం
అలజడిలా ఉందాం,ఎలుగెత్తే పాటలా ఉందాం
పడవలకు ఈతల్నీఅలలకు కదలికల్ని నేర్పుదాం
అక్షరాలకు కవచాలు తొడిగి సైనికుల్ని చేద్దాం
మట్టిని మన మాతృకగా లిఖిద్దాం
కాలానికి భాషనేర్పి భవిష్యత్తును ఇద్దాం
ప్రశ్నల్లా ఉందాం,పలకరించే స్నేహితుల్లా ఉందాం
సహజంగానే ఉందాం
నకిలీ ముఖాలమీద ఉమ్మేద్దాం
నిజంలా ఉందాంకలల్లా ఉందాంనిర్భయంగా ఉందాం
కవిత్వంలా ఉందాం
సహజ సహజ సహజంగా ఉందాం !!!
*సరిహద్దు రేఖ ‘సంకలనం నుండి…మార్చి,2000
నా పరామర్శః
పువ్వు తాజాగా ఎందుకుంటుంది?
పిట్ట రెక్కలకా స్వేచ్చ ఎక్కడిది?
హెచ్చార్కె ఎక్కడో ఓ కవితలో అన్నట్లు గుర్తు..ఎగ్జాట్ పదాలిప్పుడు గుర్తు లేవు కాని..పాపాయి ఎవరి కోసమూ ఏడవదు..ఎవరి కోసమూ నవ్వదని.
సహజత్వమంటే అదేనేమో. ఆ తత్వం మీదే ఈ కవిత్వమంతా!
పంచదార పలుకులు పది కంట పడగానే పరుగెత్తుకొచ్చేస్తుంది చీమ. ఎలుగెత్తి చాటుతుంది తోటి చీమలకా తీపి వార్త చేరేదాకా! చీమల కన్నా ఘనమైన కమ్యూనికేటర్లమా మనం?
కొమ్మల్లో కోయిలమ్మ ‘కో’ అన్నా..తుమ్మల్లో గుడ్లగూబ ‘గీ’ అన్నా
ఒక పరమార్థమేదో తప్పకుండా అంతర్గతంగా ఉండే ఉండుంటుంది. అనంత జీవకోటి అహోరాత్ర హృదయ ఘోషేమో అది! అనువదించు కోవడం మనకు కుదరనంత మాత్రాన అది జీవభాషవకుండా పోతుందాతాలు పదాల ఎత్తిపోతే కవిత్వమనుకునే మనం జంతుజాలం గొంతుల్లోని స్వేచ్హాస్వచ్చతలను కత్తికోతలుగా చిత్రిస్తాం. చిత్రం!
బక్క జీవాలనేముందిలే.. ప్రకృతి మాటను మాత్రం మనం పట్టించు కుంటున్నామాపూల రుతువు విరిసినపుడుసిరివెన్నెల కురిసినపుడు,చివురుటాకు పెదవి మీద మంచు బిందువు మెరిసినపుడుపెను చీకటి ముసిరి వినువీధిన కారు మొయిలు ప్రళయార్భటి చేసినపుడుజడి వానలు కురిసి కురిసి ఏళ్ళువూళ్ళు నొకటి చేసి ముంచేసి నపుడు..అయే చప్పుడు మన చెవుల కెక్కిందెప్పుడు?
అనుదినముం బ్రదోషసమయంబున బ్రొద్దున వేయిచేతులం
బనిగొని వర్ణవర్తికలు వ్యర్థముగా క్షణభిన్న రూప క
ల్పనల నలౌకికాకృతుల బంకజమిత్రయయాచితంబుగం
బొనరిచి నీ యపూర్వకళాపోడిమి జుల్కనసేయ బాడియే?
-అంటో కవికోకిల దువ్వూరివారెంతలా కలవర పడేం లాభం?
ప్రకృతి సంగతలా పోనీ.. పక్క మనిషి గుక్కనైనా ఒక్క క్షణమాలకిస్తున్నామాఆక్రోశం రగిలిఆవేశం పొగిలిఆనందం పెగిలి అవమానం తుంచినపుడుఅనుమానం ముంచినపుడు,అభిమానం పెంచినపుడు.. కోపం కట్టలు తెంచుకుని తాపంగుట్టలు పేల్చుకుని,పరితాపం పుట్టలు చీల్చుకుని ..చెలరేగే భావాలుకదలాడే క్రోధాలుకలిపెట్టే భయాలు.. కన్నీళ్ళుఎక్కిళ్ళుకౌగిళ్ళు .. ఆర్ద్రంగాచోద్యంగాహృద్యంగా ..తీవ్రంగాహేయంగాతీయంగా..కులం గోత్రం..మతం ప్రాంతం..చిన్నాపెద్దా..బీదా బిక్కీ..రోగీ భోగీ.. నలుపూ తెలుపూ.. ఆడామగా..తేడా లేకుండా..అందరికీ సమంగానే వస్తాయా..రావా! కలలు,కలవరాలు సమానమేగా చీమూ నెత్తురు నాళాల్లో పారే ప్రాణులెవరికైనా?ఐనా తమదాకా వస్తేగానీ కదలని రథాలం మనం.
పోయెను పాపభీతివిడిపోయెను ముష్కుర నీతిమాయమై
పోయెను శాంతివ్య్ర్థర్థమైపోయెను దేవుడు పడ్డపాట్లువా
పోయెను భూతధాత్రిసరిపోయెను పొట్టకు జీవితార్థమై
పోయెను మానవామర మహోదయస్వప్న మహస్సమాధిగానె!’
అని ఈ దేవదానవులమిశ్రమాల కోసం ఎన్నో మార్లు మారి మారి అవతరించిన దేవుడే ఆఖరికి అలసిపోయి ఇహ మార్చడం తన తరం కాదని మార్చ లేనిదంతా హతమార్చడం తప్ప వేరే దారేదీ లేనే లేదని ఒక్క క్షణం నిస్పృహలోపడి నిరాశగా చేసుకున్న సృష్టినంతా చెరిపేసుకుని ఠక్కుమని లేచి పోతేపోలేదుగదా!
మాదిరి దప్పి మానవు లమానుషవృత్తి జరింపజెల్లినన్,
కాదగు పూరుషార్థ మది కాదగునే పరమార్థ మింక నీ
మేదిని లేదెసిల్వపయి మేకు కరంగిన గుండె నెత్తురుల్
బూదయి పోయెనేఋషులు బుద్ధులు నూరక పుట్టిపోయిరే!’
అని చీకాకుల పాలవకుండా పాపం సహనంతో స్నేహంగా సర్దుకు పోయిన ఆ పెద్దాయనలాగే..కవిత్వం పొంగుకొచ్చి సమయానికి రాసే ఏసాధనమూ చేతలేక తాళపత్రం కోసం ‘తాళమా! తుత్తినియలై ధరపై బడుమా!’ అంటో కోపించిన నిప్పుకణికలతో నీరులా సహృదయ సంబంధాన్నే కోరుకుంటున్న ప్రేమకవిత్వం కూడా ఇది. ప్రేమంటూ వుంటే చంద్రుడిలో మచ్చను కూడా మందులా నాకేయచ్చంటాడు కదా శ్రీరంగం నారాయణ బాబు! గుబులును కెలికే అగాథన్నుంచే సుధను చిలికి పంచాలనుకోవడం మించిన గొప్పతత్త్వ మింకేముంటుందబ్బా ఏ కవిత్వానికైనా?
ఘటమంటూ లేకుండానే గట్లు దాటే ఆత్మలున్న వైతరణి కదా ప్రస్తుతం మనం పడి ఈదుతున్నది. పంచభూతాలకీ పంచేద్రియాలకీ కట్టుబానిసలమై పోయి బతకీడ్చటం దుర్బరమై పోతున్నదని వాపోతున్నది. ఐనా ‘దోమలు నల్లుల కన్నాకరువులు వరదలేం ఎక్కువరా కన్నా!’ అనేదో సరిపెట్టుకొనే కదా మనమీ కంటకాల బతుకునిలా ఏడుస్తూనన్నా ఈడుస్తున్నది! ‘బోను తెరిస్తే నోరు తెరిచే పెద్దపులిరా బాబోయ్-జీవితం’ అని తెలిసీ చొక్కా దులిపేసుకుని ఎంచక్కా ముందుకే దూకేస్తున్నామా లేదా? ‘అదృశ్య హలాలతో అవ్యక్తాలను దున్నిఅనుమానాలను చల్లి అలజడి సాగునే ఐనా ఎలాగో కొనసాగిస్తూనే ఉన్నామా కాదాఈ కవిత్వానిదా టైపు ఆందోళన కానే కాదు. చరిత్ర కెక్కాల్సిన బాధల్ని అశ్రుబిందువుల హిందోళంగా మలిచే కళ. మరి అవసరమేగా!
లోకమంతా మరీ ఇంతలా బురద గుంతలానే ఉందా?. బ్రహ్మజెముళ్లే గాని బోధి వృక్షాలసలే మొలవని పుంతై పోయిందాసుష్టుగా మెక్కి మేడమీదెక్కి మెత్త పరుపులు తొక్కే నిద్ర పట్టని పెద్దయ్యల నెత్తి మొత్తుకోళ్ళకేం గానీ.. ఆవల జొన్నచేను కావలికని మంచె మీద చేరిన నాయుడుబావయ్య కన్నుమూత పడకుండా తీసే కూనిరాగాల నాలకించవయ్యా! ‘ఆ కులాసా ఊసులనే ఎంకిపిల్ల ఊహలకో దిలాసాగా చేరేసే చల్లగాలి పదాలవుదాం.. పదవమ్మా!’అంటున్నదీ కవిత్వం. సర్దాగానే కాదు సరసంగాను లేదూ ఈ తరహా వరస?
బ్రతుకేమన్నా మృత్యుగ్రంథ ముపోద్ఘాతమాసంక్లిష్టం కావచ్చేమో కానీ.. సజీవ స్వప్నసౌజన్యం కూడా సుమా! హృదయానువాద కళన ఆరితేరుండాలే కాని మూలమూగ సైగల్నిసైతం ‘సైగల్ రాగాలు’గా మలచడం క్షణం. ‘సహజ సహజ సహజంగా ఉందాం !!!’ అని కవి అన్నేసి మార్లలా కలతనిద్ర మధ్యలో మాదిరి పలవరించడ మాత్రం మహా అసహజంగా ఉందని కదూ సందేహంతత్వం తలకెక్కకే ఈ చిక్కుముడి. మనసు ఎక్కి జారే జారుడుబండంట చైతన్యం. రాయీ రప్పాపశువూ పక్షీమనిషి- అదే క్రమంలోశుద్ధభౌతికంప్రాణంమనసు లాక్రమించిన జీవస్థానాలని ‘తత్త్వప్రభ’ ప్రబోధం.’పరస్మాత్ ప్రస్థితా సేయం/భూమి కానాం పరంపరా/సోపానకల్పితాకారా/నిః శ్రేణి రివ నిర్మితా’ అంటే అర్థం ఇదేనండీ బాబూ! భూ భువ సువ ర్లోకాల పైనున్నమహర్లోకంలోని చివరి ఆనందం మన మనీ ప్రపంచంలో గుప్త రూపంతో అప్రకాశంగా అణిగి పోయింది కదా.. ఈ చిదానందాన్నా కూపంనుంచి చివరి కెలాగైనా చేదుకోవడమే ఏ కళకైనా పరమావధని లక్షణగ్రంధాల సిద్ధాంతం కూడా. తృణకంకణం కృతి సమర్పణంలో ‘శాశ్వత నవ్య స్ఫురణల/ నశ్వరలావణ్యమై పెనగకావ్యకళా/విశ్వమునం దానంద ర/సైశ్వర్యము లేలు’ నని రాయప్రోలువారానాడు కనిపెట్టిన రస రహస్యాన్నే యగైన్’ యే చోళీ కే పీచే యేహీ హై’ అని మళ్లీ ఈ కవిత గుర్తు చేస్తున్న్దన్న మాట. గొప్పే కదా మరి?
తొలి ఉషస్సు తూర్పును తడిపే వేళకి గుండె చేతపట్టుకుని గుమ్మంలో నిలబడుండేదే కవిత్వం. లోగిలి ఎవ్వరిదని కాదు తల్లిలా లాలించడమే కవితా ధర్మం. ఆశించిన హస్తం ఏ భూతానిదైనా కాని ప్రేమతో ముందుకు నడిపించడమే పదంలోని తండ్రి పని.’ఒరులేయని యొనరించిన/నరవర! యప్రియము తనమనంబునకు తా/నొరులకు నని చేయకునికి, /పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్’ అని కదా నీతి! ఆ నీతిని తన ధర్మంగా ప్రకటించుకున్న కవతని అభినందించి తీరాలి. ఆకాశం అనంతం అగాథం అనంతం కారుణ్యం అనంతమైతే కావచ్చు కానీ కవి అంతరంగం ముందు అవన్నీమోకాలు తడవని పిల్లకాలువలు. నిరంకుశుడైతేనేమి ఒక ధర్మాస్త్రానికి సత్యంగా కట్టుబడుండాల్సిన ఆంజనేయుడు కవి. 

అపారసార సంసారసాగర మధనం చేసి నవజీవన సుమధుర సుధారస సువర్ణ కలశం తీసి నిరాశ నిట్టూర్పులతో నిండి యెండి మండే కంఠాల రక్తి భక్తి ముక్తి శక్తిధారలుగ ఒలికించాలనే సంకల్పం స్వల్పమైనదా?నిప్పుకణికలా,
నిలువెత్తు నిజంలాఅలల్లాఅలజడిలా,కలల్లాకలవరంలాఅక్షరాలకు తొడిగే సైనిక రక్షాకవచాల్లామట్టిలాకాలానికి భాషనేర్పే భావిలాప్రశ్నల్లా,పలకరించే స్నేహితుళ్ళా సహజంగా సహజంగా సహజంగా ఉంటానంటం కన్నామించిన మంచి దర్శనం ఏ కవికైనా ఇంకేముంటుందిసహజంగా ఉంటానని అన్నేసి మార్లు సంకల్పం చెప్పుకున్నా కవిత్వంలా మాత్రం వుండడం మానబోనని ప్రకటించడమే ఈ కవి అసలు పాటవం. ఎక్కడ ప్రేమ అవ్యాజమోఎక్కడ సత్యమకుంఠితమోఎక్కడ నీతి నిశ్చలమో అక్కడ కవి పువ్వై వికసించడంలో వింతేముంది కానీ ఎడారిలో సైతం ఒయసిస్సై పిలవడంనడిసంద్రాన కూడా గడ్డిపోచై నిలవడం అపురూపం. ‘చిగురింపగలవాడు శిశిరకాలమునైన ప్రకృతినెల్ల వసంతరాగ కాంతి/కాయింపగలవాడు కాళరాత్రినైన రమణీయ చంద్రికా సముదయముల/కురియిపగలవాడు మరుభూమిలోనైన సతతము అమృత నిష్యంద వృష్టి/మలయింపగలవాడు మండువేసవినైన మలయపర్వతశీత మారుతములు/అరయగలవాడు బాహ్యము నంతరంగమును/వ్రాయగలవాడు దైవ లీలావిలాస/చిత్రములనైనబ్రహ్మాండసీమనైన/కవికసాధ్యంబు రవ్వంత గలదె భువిని! -అన్న తత్వం ప్రతి అక్షరంలో ప్రత్యక్షమౌతున్నందునే ఈ కవిత్వానికిలా ఉత్తమత్వం.
హంసలన్నీ శ్వేత వర్ణంలో ఉండవు కొన్ని నల్లగానూ ఉంటాయంటారు.. ‘ నల్లగా ఉన్నావేమని’ నాలాంటి నిత్య శంకితుడొకడు నిలదీస్తే ‘నీలకంఠుడు నిద్రపోతే గళమే నల్లకలు వనుకొని కొరికా. విశ్వమానవ సహస్రారం మళ్ళా అర్పిస్తేనే తెల్లబడేద’ని జవాబు.
అర్థం అయితే తత్-త్వం-అసి(నీవే అది). కాని వారికీ కవిత్వంలాగానే తత్వం- మసి.
స్వస్తి
-కర్లపాలెం హనుమంతరావు
http://karlapalem-hanumantha-rao.blogspot.in/2016/03/blog-post.html

కుంకుడు చెట్టు - పచ్చని చెట్టు

కవిసంగమం 


మూడు తరాల కవిత్వపఠనం, లక్షల కొద్దీ కవితలు, ఎందరెందరో కొత్త కవులు ఇది కవిసంగమం వర్తమాన సాహిత్యనిధికి అందజేసిన సిరి సంపద. ఈ మాట అందరికీ తెలిసిందే ఈ ప్రంపంచీకరణ రోజుల్లో కవిత్వంతో పాటూ ఇక్కడ కొన్ని స్నేహాలు బంధుత్వాలై కలవడం మరో ఆసక్తికర చారిత్రిక పరిణామం., ఇందుకు "నీవొక పచ్చని చెట్టైతే పిట్టలు వాటంత అవే వచ్చి వాలేను" అంటూ ఆహ్వానించిన పిలుపే సాక్షం.
కవిసంగమం నెలవారీ సభలకి వచ్చిన సీనియరు కవులు పుత్రోత్సాహంతో మురిసిపోవడం మనం చూస్తూనే ఉన్నాం, అదే సమయంలో కొత్త కవుల కళ్ళలో మెరుపు ఎన్ని సాయంత్రాలని దేదీప్యమానం చేసిందో ఎంత చెప్పినా తక్కువే, ఇంటికి తిరిగి వెళ్ళి పచ్చని చెట్టు పంచిన జ్ణాపకాలని కవిత్వంలో ప్రాణ వాయువుగా నింపి ఈ సాహితీ చారిత్రక ఘట్టాలని కవితల రూపంలో పొందుపరచడం కూడా మనం చూస్తున్నాం.
తొలినాళ్లలో వెళ్దాం అని కుదరక "ఈ-శనివారం" అని నేను రాసుకున్న కవిత. "నా లామకాన్ గోల" యశస్వీ సతీష్ కవిత, తదుపరి బాల సుధాకర్ మౌలి రాసుకున్న అపురూప వ్యాసం, నా చెల్లెలు తోట నిర్మలా రాణి రాసిన కవిత, ఇప్పటి కుంకుడు చెట్టు ఇదే కోవకి చెందినవే, రాసిన నాలుగైదు కవితల్లో విభిన్న కొణాల్ని వస్తువులని తీసుకోవడం తనదైన ఓ ప్రత్యేక ముద్రతో Indus Martin రాసిన "కుంకుడు చెట్టు" పసిరి వాసన వేసి కవి పరిణితిని పచ్చగా మన ముందుంచింది.
ఎత్తుగడలో ప్రపంచీకరణ గుర్తు చేస్తూ, భారతీయ నాగరికత మూలాలని ఇతర ప్రాశ్చాత్య దేశాల కంటే ముందుగా నడిచిన మన గతాన్ని గుర్తుచేసింది. ఆరునెలల క్రితం కుంకుడు కాయ వాసన వస్తోందని కొన్న tresmee shampoo గుర్తుకొచ్చి టెంకిజెల్ల కొట్టినట్టు ఐంది.
రెండు మూడు పేరాలలో పాఠకుడుని కవితలోకి తీసుకెల్లిన తీరు బలే ముచ్చటేసింది,అక్షరాలని "నిఖార్సైన నల్లని కాయలతో" అని పోల్చినప్పుడు, మరీ ముఖ్యంగా మూడో పేరా చదవగానే కవిని పొగడకుండా ఉండలే కదూ...
నాలుగో పేరాలో "ఎన్ని తరాల తలల మురికినీ
తేటనైన నురగలో ప్రక్షాళన చేసాయో ఆ ఫలాలు" అంతర్లీన సూక్ష్మ విమర్స చేసి ఫలాలు అనడం, కొంత విస్మయాన్ని కలిగించి శభాష్ అనిపిస్తుంది.
ఐదో పేరాకి వస్తే తెలుగు వైభవం ఎన్ని ఆటుపోట్లకు గురైందో చెప్పి "ఇప్పటికీ నిలబడే ఉంది తనను కన్న గడ్డపై" అన్నప్పటికీ "తెల్ల తుఫానులు" అన్నపదం నాకెందుకో "తెల్ల పాములు"గానే కనపడింది నాలుగైదు సార్లు చదివినప్పటికీ....మొదటి రెండు పేరాలు నేను ఎందుకు రాయవలసి వచ్చిందో కవిత చివరికి వచ్చారుగా ఆరో పేరాతో మీకే అర్ధం ఐవుంటుంది.
తెలుగు భాష మరియు సాహిత్యాన్ని అత్యంత ప్రేమించే " Indus Martin " ఇప్పటికే "అనగనగా" అంటూ తన ప్రయత్నంతో సఫలీకృతం చెందాడు. ఈ బాటసారికి కవిత్వం కొత్తో పాతో తెలియదు కానీ ఇతనిలో ఓ సహజ కవి దాగున్నాడన్న మాట నిఖర్సైన సత్యం. కవి.మార్టిన్ మరిన్ని సామాజిక ప్రయోజన కవితలతో వర్తమానానికి తలంటాలని కోరుకుంటూ...మరో కవిని తెలుగు సాహిత్యానికి అందించిన కవిసంగమానికి అభినందనలు.కృతజ్ణతలు.....మీ మూడో వేప చెట్టు...
మార్టిన్//కుంకుడుచెట్టు// 24 నవంబర్ 2014
ఇప్పటి ఇంగ్లీష్ షాంపోలు రాకముందునుండీ
అమేరికన్ కండీష్నర్లు రసెల్స్ దుకాణాల్లో
అమ్మబడడానికి పూర్వంనుండీ
ఇక్కడేవుంది ఈ కుంకుడు చెట్టు
నిఖార్సైన నల్లనికాయలతో నిటారైన దేహంతో
ఎంత దర్పంగా వెలిగిందో
ఆంధ్రభోజులూ, అతిధి బ్రౌన్లూ
ఎంత శ్లాఘించారో దీని సరళసౌందర్యాన్ని
ఎందరు తిక్కనలు ఏతాళ్ళపాక నుండో తెచ్చ్చిన
గుండ్రాళ్ళకింద మెత్తగానలిగి
ధూర్జటుల జటిలహస్తాలలో పిసకబడి
ఎన్నెన్ని తరాల తలల మురికినీ
తేటనైన తమ నురగల్లో ప్రక్షాళన చేశాయో ఆఫలాలు
ఏంవైభవం దానిది... ఏచీడలూ పట్టలేదు దానికి
ఏసముద్రాలు దాటి ఎన్నిరాలేదూ తెల్లతుపానులు?
ఖైబరు కనుమలుదాటి రాలేదా ప్రళయాలు?
విప్పత్తులను దాటి, ఆపత్తులకు నిలచి
ఇప్పటికీ నిలబడేవుంది తననుకన్న గడ్డపై
ఇప్పటికీ ఈ చెట్టుకొమ్మలక్రింద కూర్చుని
ఏ శారదమ్మో తన సి.వి. రాసుకుంటూనేవుంది
ఏరాజో తన కాశీమజిలీ కథల్ని మననంచేసుకుంటూనే వున్నాడు
ఏ యశశ్వో తపస్విగా మారి
ప్రయోక్తగేయాల్ని జపిస్తూనే వున్నాడు
ఏ వీరఫాండ్య 'కట్ట 'బ్రహ్మన్నో అక్కడ చేరిన పిట్టల పాటల్ని
'వాహ్', 'ఖూబ్' అంటూ ఆనందిస్తూనే వున్నాడు
ఏ రా(రాం)కుమారుడో గోలచేస్తున తుంటరి వుడుతల్ని
ప్రేమతో అదిలిస్తూనే వున్నాడు
అటుగా వచ్చిపోయే ఏబాటసారో తనకథను
అనగనగా అంటూ కొనసాగిస్తూనే వున్నాడు
బంగారువాకిళ్ళలో జరుగుతున్న సంగమాల సాక్షిగా
కుంకుడు చెట్టు కొత్తపూత వేస్తూనేవుంది
In the fond memories of "Poetry Reading' conducted under a soap-nut tree in Golden Threshold last night ...!

~
వర్మ కలిదిండి 
Nvmvarma Kalidindi

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...